సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 42 లక్షలు నగదు

సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 42 లక్షలు నగదు
ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ఏజెఎన్సీలు సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా రూ. 42 లక్షల నగదును గుర్తించాయి.  కేసు నేపథ్యంలో సిరాజ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అయితే డీసీసీబీ బ్యాంక్‌లో ఉన్న లాకరు తెరిచేందుకు సిరాజ్ తండ్రి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఖాతాను సీజ్ చేయడంతో లాకర్ తెరవటానికి కుదరదని సిరాజ్ తండ్రికి బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. 
 
ఈ విషయంపై రెండు రోజుల పాటు బ్యాంక్ అధికారులను సిరాజ్ తండ్రి కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్‌ఐగా పని చేస్తున్న సిరాజ్ తండ్రితో పాటు కుటుంబ సభ్యుల  ఖాతాల వివరాలు అందించాలని వివిధ బ్యాంకులను దర్యాప్తు అధికారులు కోరారు. విజయనగరం డీసీసీబీలో సిరాజ్‌ పేరిట పొదుపు, డిపాజిట్‌ ఖాతాలున్నాయి.  నిందితుడి కుటుంబ సభ్యులు నలుగురికీ ఇదే బ్యాంకులో నాలుగు ఖాతాలు ఉన్నాయి.
ఏఎస్సైగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్‌ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకూ వారి కుటుంబమంతా కొత్తవలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్‌ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్​స్టేషన్​కు బదిలీ అయింది. కొత్తవలస డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్‌ విజయనగరం శాఖకు మార్చుకున్నాడు. సిరాజ్‌ ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్‌డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తోంది. విడతల వారీగా రూ.70,000లు, రూ.80,000ల చొప్పున పలుమార్లు జమైనట్లు గుర్తించారు.
జాతీయ బ్యాంకులెన్నో ఉన్నా డీసీసీబీలో ఖాతాలు కొనసాగించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సిరాజ్‌ ఖాతాలో తండ్రే నగదు జమ చేశాడా ఇతరులెవరైనా వేశారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు రూ.70 లక్షల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.  సిరాజ్‌కు ఉగ్ర లింకులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుపై విజయనగరంలో ఎన్‌ఐఏ విస్తృతమైన దర్యాప్తును నిర్వహిస్తోంది.
గత మూడు రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్‌ను స్థానిక కోర్టు కస్టడీకి అప్పగిస్తే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని పోలీసులు భావిస్తున్నారు.