పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్​కు ఫీల్డ్ మార్షల్​ హోదా!

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్​కు ఫీల్డ్ మార్షల్​ హోదా!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్​కు పాక్ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్​ హోదాను కల్పిస్తూ ప్రధాని షెహబాజ్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తలెత్తిన ఉద్రిక్తల వేళ భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బ తినడంతో, ఆ దేశ ప్రజలు మునీర్ ను ఆ పదవి నుండి తొలగించాలని నిరసన ప్రదర్శనలు చేస్తున్న సమయంలో, భారత్​ సైన్యం ధాటికి చేతులెత్తిసిన జనరల్ మునీర్‌కు షెహబాజ్ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టడం విస్మయం కలిగిస్తుంది.

పాకిస్థాన్​ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ జనరల్​గా మునీర్ రికార్డు సృష్టించారు. మొదటిసారిగా ఆయూబ్ ఖాన్ 1959- 1967 మధ్య కాలంలో ఫీల్డ్ మార్షల్ పనిచేశారు. అయితే, ప్రభుత్వాన్ని కూలదీసి, తనను దేశ అధ్యక్షునిగా అక్టోబర్, 1958లో ప్రకటించుకున్న తర్వాత, సైన్యం నుండి ఉద్యోగ విరమణ పొందడానికి ముందుగా అధ్యక్ష కేబినెట్ ద్వారా 1959లో `పౌరసమాజం’ కోర్కె మేరకు తనకు తానే అటువంటి హోదా కల్పించుకున్నారు. 

అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత జనరల్ ముసాఖాన్ ను కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించారు. ఆ తర్వాత ఆచరణలో ఆయన సైన్యంలో పనిచేయని లేదు. తనను తానే అయూబ్ ఖాన్ ఆ పదవిలో నియమించుకోగా, మునీర్ ను ప్రధాని నేతృత్వంలోని పౌర ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన సైన్యంలో పనిచేయనే లేదు. కానీ మునీర్ తన రిటైర్మెంట్ వరకు పనిచేస్తారు. ఈ ఏడాది రిటైర్ కావాల్సి ఉన్నా, గత ఏడాది తీసుకొచ్చిన చట్టం ప్రకారం మరో మూడేళ్లు 2027 వరకు కొనసాగుతారు. ఫీల్డ్ మార్షల్ గా ఎటువంటి అధికార హోదా లేనప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత కూడా యూనిఫామ్ లో కొనసాగవచ్చు. 

అంతటి కీలకమైన పదవిని మునీర్​కు ఇవ్వడానికి రాజకీయ, భౌగోళిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్​లో పౌర ప్రభుత్వాలు సైన్యం కనుసన్నలలో పనిచేయాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైన్యంను ధిక్కరించే ప్రయత్నం చేస్తే ఎంతటి వారైనా మనుగడ సాగించడం కష్టమే. బెనజీర్, భుట్టో, నవాజ్ షరీఫ్ వంటి వారి భవిష్యత్తు ఏవిధంగా అంధకారంగా మారిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 

తాను ప్రధాని కావడానికి షెహబాజ్ షరీఫ్ మునీర్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది పాకిస్థాన్​లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్​కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్​ సాయం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు అప్పట్లో రాసుకొచ్చాయి. అంతేకాకుండా, ఎన్నికల్లో సైన్యం జోక్యంపై కూడా అప్పట్లో మీడియాలో పెద్దఎత్తున చర్చ నడిచింది. 

షెహబాజ్ షరీఫ్​కు ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేయడంలో మునీర్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన ఎన్నికకు సహకరించిన మునీర్​ రుణం తీర్చుకునేందుకు షెహబాజ్ ఈ అత్యున్నత హోదా ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవంక, అసిమ్ మునీర్ పంజాబ్ ప్రావిన్స్​కు చెందిన వారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. 

ప్రాంతీయ అభిమానంతో ఒకరికొకరు సహకరించుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ రంగంలో ఆధిపత్యాన్ని చలాయించే వారంతా పంజాబ్ ప్రావిన్స్​కు చెందిన వారే కావడం గమనార్హం. కీలక పదవుల్లో వారే ఉంటారు. కీలక పదవుల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ ప్రాంతానికి చెందిన వారినే ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఒకే ప్రాంతం ఆధిపత్యంపై పాక్​లోని ఇతర ప్రాంతాల ప్రజలు చాలాసార్లు తిరుగుబాటు చేశారు. మునీర్​కు అత్యున్నత హోదా ఇవ్వడం వల్ల పంజాబ్ ప్రావీన్స్ ఆధిపత్యం మరోసారి బయపడింది.