ఐఎస్ఐ ఆహ్వానంపై పాక్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ

ఐఎస్ఐ ఆహ్వానంపై పాక్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ

పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాల ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంపీల ప్రతినిధుల బృందాలను విదేశాలకు పంపాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు ప్రతినిధి బృందాలను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత నలుగురు ఎంపీల్లో ఒకరైన గౌరవ్ గొగోయ్‌ విషయంలో ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

తాజాగా ఆయనపై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్  ఆహ్వానం మేరకు గొగోయ్ పాక్ వెళ్లారని ఆరోపించారు. అక్కడ శిక్షణ పొందేందుకే ఆయన వెళ్లారని కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నట్టు చెప్పారు. ”పాకిస్తాన్ హోం శాఖ నుంచి లేఖ రావడంతో గౌరవ్ గొగోయ్‌ ఆ దేశానికి వెళ్లారు. పాక్ ప్రభుత్వం ఆహ్వానం మేరకే ఆయన వెళ్లారు. విదేశాంగ శాఖ, సాంస్కృతిక శాఖల ఆహ్వానంతో కాదు. ఇది చాలా తీవ్రమైన అంశం. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి” అని హిమంత బిస్వ శర్మ డిమాండ్ చేశారు.

దీనికి ముందు, విదేశాలకు వెళ్లే భారత ప్రతినిధి బృందంలో ఈశాన్య ప్రాంతాల ఎంపీలను ఎంపిక చేయడంపై హిమంత బిస్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంతాల నుంచి ముగ్గురు ఎంపీలను ఎంపిక చేయడం చాలా సంతోషమని, నాగాలాండ్ నుంచి ఒకరిని, అసోం నుంచి ఇద్దరిని ఎంపిక చేశారని చెప్పారు. 

విదేశాలకు పంపే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన జాబితాలోని గౌరవ్ గొగోయ్‌ పేరును తొలగించాలని రాహుల్ గాంధీని కోరారు. కాంగ్రెస్ ఎంపిక చేసిన నేతల జాబితాను ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీనిపై శర్మ స్పందిస్తూ, జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా అసోం ఎంపీ పేరును తొలగించాలని నేరుగా గొగోయ్ పేరును ప్రస్తావించకుండా పేర్కొన్నారు.

”జాబితాలో పేర్కొన్న ఎంపీల్లో ఒకరు (అసోం నుండి) పాకిస్తాన్‌లో ఎక్కువ కాలం ఉన్న విషయాన్ని ఖండించలేదు. రెండు వారాల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎన్జీవో నుంచి జీతం పొందుతున్నట్టు విశ్వసనీయ పత్రాలు చూపిస్తున్నాయి” అని శర్మ ఒక ట్వీట్‌లో తెలిపారు.