
ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్ తాజాగా దాన్ని అంగీకరించింది.
తమ కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్ వైమానికి దాడులు జరిపిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌లో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మే 10 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కీలకమైన వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడులను ధ్రువీకరించారు.
“భారత ఆపరేషన్ ప్రారంభమైన కొన్ని క్షణాల తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తెల్లవారుజామున 2.30 గంటలకు నాకు ఫోన్ చేశారు. దాడుల గురించి ఆయన నాకు తెలియజేశారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది” అని పాక్ ప్రధాని వెల్లడించారు.
అయినా భారత క్షిపణులు, డ్రోన్లు కొన్ని తమ స్థావరాలను తాకాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ వాయుసేన స్థానిక సాంకేతికత సాయంతో తయారు చేసిన జెట్లను, అలానే పాకిస్థాన్ జెట్లను వినియోగించిందని షరీఫ్ తెలిపారు. అయితే భారత్ క్షీపణులు తమ లక్ష్యాన్ని ఛేదించాయని ప్రకటించారు. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఈ విషయాన్ని సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల మధ్యన అంగీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉంది.
భారత్ బాలిస్టిక్ క్షిపణుల వల్ల నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసం అయింది. పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడి చేసింది భారత్. అయితే అంతకుముందు పాక్ ప్రధాని తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము విజయం సాధించామని ప్రకటించుకున్నారు. అంతేకాక సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా భారత్ దాడి గురించి అంగీకరించడం గమనార్హం. అంతకుముందు భారత్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు మరోసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
భారత్, పాక్ చర్చలకు కూర్చొని జమ్మూ కశ్మీర్ సహా అన్ని అపరిష్క్రత అంశాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. ఇరుదేశాల మధ్య 3 యుద్ధాలు జరిగాయని, వాటివల్ల ఏమి సాధించలేకపోయామని షెహబాజ్ చెప్పారు. ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అన్నింటినీ పరిష్కరించుకోవాలని ఆ పాఠం చెబుతోందని పేర్కొన్నారు. ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో సహకరించుకోవచ్చని తెలిపారు. ఇరుదేశాల మధ్య అపరిష్క్రత వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుతామని పాక్ విదేశాంగ శాఖ ఇశాక్ దార్ కూడా ప్రతిపాదించారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు