మద్యం కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్

మద్యం కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్
ఏపీలో  సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో తాజాగా  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వరుసగా మూడు రోజుల పాటు వీరిని సిట్ అధికారులు విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు.  మందస్తు బెయిల్ కోసం వీరు దాఖలు చేసిన  పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసిన  కొద్దీ గంటలకే వీరు అరెస్ట్ అయ్యారు.
 
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కాం కేసులో నాటి సిఎంఒ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. వీరు ముగ్గురే నగదు బదిలీ వ్యవహారాలు చూసారని చెబుతున్నారు. దానితో ఈ మొత్తం కుంభకోణంలో అసలు లబ్ధిదారులు ఎవ్వరో వీరు గుట్టు విప్పుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే జరిగితే జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందులలో పడినట్లే అని భావిస్తున్నారు.

వీరిద్దరూ తమ కుటుంబసభ్యుల పేర్లతో కంపెనీలు పెట్టి మద్యం సొమ్మును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఎపి సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు.  గతంలో విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంపై జరిగిన సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యారని మీడియా ముందు చెప్పారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి పదవీకాలం వైసిపి ఓడిపోయే ముందు రోజునే పూర్తి అయింది. ఐఎఎస్‌గా చేసి మద్యం స్కాంలో జైలుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

సీపీ ఐదేళ్ల పాలనలో ధనుంజయ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బిల్స్ చెల్లింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ధనుంజయ రెడ్డి జోక్యం ఉంది అంటూ గతంలో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే ఆరోపించారు.  వైసీపీ హయాంలో లిక్కర్ వ్యాపారం మొత్తం నగదు రూపేనా సాగిన విషయం తెలిసిందే. ఈ నగదులో ముడుపుల వాటాను ప్రతినెలా పెద్దలకు చేర్చే వాళ్ళు అని., ఇందులో వీరిద్దరి పాత్ర కూడా ఉందని సిట్ ఆరోపిస్తోంది.

 
ఇప్పుడు నగదు తరలింపు వ్యవర్మలో కీలక పాత్రధారులుగా ప్రచారంలో ఉన్న ముగ్గురు కూడా అరెస్ట్ కావటంతో లిక్కర్ స్కాం డబ్బు ఎక్కడెక్కడకు, ఎలా వెళ్ళింది అనే గుట్టువిప్పుతారా? అసలు బాస్ రహస్యాలు బయటపెడతారా? అన్నది ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్న అంశం. ఏపీ లిక్కర్ స్కాం లో దగ్గర దగ్గర రూ. 3500 కోట్లు చేతులు మారినట్లు సిట్ గుర్తించిందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఈ ముగ్గురు చెప్పే విషయాలే అత్యంత కీలకం అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు .