‘కిరానా హిల్స్’లో అణుధార్మికత లీకేజీపై నోరు మెదపని పాక్!

‘కిరానా హిల్స్’లో అణుధార్మికత లీకేజీపై నోరు మెదపని పాక్!

పాకిస్థాన్ అణు స్థావరం అని చెబుతున్న కిరానా హిల్స్లో అణుధార్మికత లీకేజీ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతుంది. తాజాగా కిరానా హిల్స్ లో ఎలాంటి లీకేజీ జరగలేదని ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎమర్జెన్స (ఐఏఈఏ) చెబుతోంది. అదే నిజమైతే, అణుధార్మికత లీకేజీ కాకుంటే అమెరికా నుంచి న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది? 

ఈజిప్టు నుంచి రేడియేషన్ ను కట్టిడి చేయడానికి ఉపయోగించే బోరాన్తో మరో విమానం పాక్ గగనతలంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కిరానా హిల్స్ పై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్థాన్ సర్గోదా జిల్లాలోని కిరానా హిల్స్ లో  అణు దాడులకు ఉపయోగించే టాక్టికల్ న్యూక్లియర్ వార్హెడ్లను ఉంచినట్లు వార్తలు వచ్చాయి.

దీనికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ముసఫ్ ఎయిర్ బేస్ ఉంది. భారత్ దాడి చేసిన ఎయిర్ బేస్ లలో ఇది ఒకటి. ఇక్కడి నుంచి కిలారీ హిల్స్ కు కనెక్షన్ ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడే వార్హెడ్లకు నష్టం జరిగి రేడియోయాక్టివ్ రిలీజ్ అయ్యి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.  భారత్ దాడి చేసిన 11 వైమానిక స్థావరాలు (నూర్ఖాన్, రఫీకి, సుక్కుర్, సియాల్కోట్, మురిద్, పర్సుర్, చునియన్, స్కర్దు, భొలారి, జకోబాబాద్, సర్గోదా) రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ కూడా ఒకటి.

ఇక్కడే భారీ విధ్వంసం సృష్టించే అణు దాడులు చేసే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్హెడ్లను పాక్ నిల్వచేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలవరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అణుధార్మికత వెలువడి ఉండవచ్చన్నది ఆ కథనాల సారాంశం. అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి డెరెక్ గ్రాస్మన్ కూడా ఈ వాదనను బలపర్చారు. పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిన తర్వాత అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బి350 ఎంఎంఎస్ పాక్ గగనతలంలోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ విమానం ద్వారా రేడియోధార్మిక యాక్టివిటీని అంచనా వేస్తారు. 

అణు కర్మాగార ప్రమాదాల తర్వాత రేడియేషన్ లీక్‌లను పర్యవేక్షించడం, రేడియోలాజికల్ సంఘటనల సమయంలో అత్యవసర సేవలకు ఈ విమానాన్ని మోహరిస్తారు. అందుకే దీనిని ‘రేడియేషన్ స్నిప్పర్’ అని కూడా అంటారు. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్ రాడార్ 24’లో ట్రాక్ చేసిన వివరాల ప్రకారం ఈ విమానం పాక్ గగనతలంలో ప్రయాణించినట్లు చూపిస్తుంది. 

వాస్తవానికి అమెరికాకు చెందిన ఈ విమానాన్ని 2010లో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు అమెరికా అప్పగించినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ విమానం పాకిస్థాన్ వద్దే ఉన్నది కాబట్టి భారత్ ఎయిర్ బేస్ పై దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందని పాక్ అనుమానించిందా? లేక ముందు జాగ్రత్త చర్యగా బి350 ఎంఎంఎస్ విమానాన్ని మోహరించిందా? అనే ప్రశ్న సోషల్ మీడియాను తొలుస్తోంది.

న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం వచ్చిన రీతిలోనే ఈజిప్టుకు చెందిన మరో విమానం కూడా బోరాన్ నిల్వలతో పాకిస్థాన్లోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. బోరాన్ న్యూట్రాన్లను అబ్జార్బ్ చేసుకుంటుంది. ముఖ్యంగా బోరాన్-10 ఐసోటోప్ లో అణు ధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు విలీనం అవుతాయి. దీంతో రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకోసమే ఈజిప్టు నుంచి బోరాన్ తీసుకువచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కారణాలతో కిరానా హిల్స్లో అణుధార్మికత లీకేజీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కానీ తమ దేశంపై వస్తున్న వార్తలపై మాత్రం ఇప్పటి వరకు పాకిస్థాన్ నోరు మెదపలేదు. అయితే దాయాది దేశం మౌనవ్రతం పాటించడానికి పలు కారణాలు ఉన్నాయి. పాక్కు చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసింది. అందులో రెండు ఎయిర్ బేస్ లు పాక్ అణు స్థావరాల సమీపంలో ఉన్నాయని వరల్డ్ మీడియా కోడై కూస్తోంది. 

తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని పదేపదే చెబుతున్న పాకిస్థాన్ గర్వాన్ని ఈ దాడితో భారత్ పటాపంచలు చేసింది. అణ్వాయుధాల నిల్వలను ఉంచిన కిరాణా హిల్స్, నూర్ఖాన్ ప్రాంతాల్లో క్షిపణులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ కు  అణుదాడి ఆలోచన వచ్చే లోపే ఆ స్థావరాలను నామరూపాల్లేకుండా చేస్తామన్న సంకేతాలను భారత్ ఇచ్చింది. భారత్ చేసిన ఈ హెచ్చరికను పాకిస్థాన్ బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.

మరోవంక, భారత్ తమ దేశ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసిందని ఒప్పుకుంటే అంతర్జాతీయ వేదికపై తమ పరువు పోతుందన్న ఆలోచనలో దాయాది దేశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఈ అంశంపై దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని పాకిస్తాన్ భయపడి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే, న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా రక్షించుకోలేనంత శక్తిహీనంగా పాలకులు తయారయ్యారని స్వదేశంలోనే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

అదీగాక, పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశమని అందరికి తెలిసినా ఆ దేశంలో ఉన్న అణ్వస్త్రాలు నిల్వ ఉంచిన ప్రదేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ దాడి తర్వాత ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ ఎయిర్ బేస్ లపై దాడి చేస్తే, అణ్వాయుధ నిల్వ ఉన్న ప్రదేశాల్లో అలజడిరేగడం ఆందోళన కలిగించే అంశమే. 

తాజాగా భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ కూడా పాకిస్థాన్ అణ్వస్త్రాలపై అనుమానం వ్యక్తం చేశారు. వాటిని అంతర్జాతీయ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో తమ దేశంలో అణుధార్మికత లీక్ అయ్యిందని పాకిస్తాన్ ఒప్పుకుంటే, అణ్వాయుధాలను నిర్వహించగల సామర్థ్యం పాకిస్తాన్ కు  ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దానితో కిరానా హిల్స్లో వాస్తవ పరిస్థతిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.