మహిళల అభివృద్ధి కోసం అహల్యాబాయి చట్ట సవరణలు

మహిళల అభివృద్ధి కోసం అహల్యాబాయి చట్ట సవరణలు
 
మహిళల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం అహల్యా బాయి హోల్కర్ చట్టసవరణలు చేశారని బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గుర్తుచేశారు. భర్తలు చనిపోయిన మహిళలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భర్త ఆస్తిలో  ఆ భార్యకు హక్కు ఉంటుందని చట్ట సవరణ చేసి మార్పులు తీసుకువచ్చారని ఆమె చెప్పారు.
 
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యా భాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకల ఏర్పాటుకు వర్క్‌షాప్ నిర్వహిస్తూ  దళితులకు భూములు కేటాయించటం వారికీ సంక్షేమం అందించటంలో అహల్య భాయి ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. 1795వ సంవత్సరం ముందే ఇవన్నీ చేశారంటే అహల్య భాయికు ఎంత ముందు చూపు ఉందో అర్ధమవుతుందని తెలిపారు. చేనేత రంగం వెనుకబడుతున్న పరిస్థితుల్లో మహేశ్వర్ అనే ప్రదేశంలో వారి ఉనికిని కాపాడారని చెబుతూ మహిళల్లో ధైర్యాన్ని అహల్య భాయి నింపారని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
 
ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని ఆనాడే అహల్య భాయి హోల్కర్ ఆలోచించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేశారని ఆమె చెప్పారు. పరిశ్రమలకు పెట్టుబడులు రావాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో గమనించి వాటిపై ఆనాడే దృష్టి పెట్టారని తెలిపారు.
 
అహల్య భాయి సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేదని దగ్గుబాటి పురందేశ్వరి గుర్తుచేశారు. పాశ్చాత్య దేశాలు మన దేశంలోని గుడులు గోపురాలపై దాడులు చేశాయని చెప్పారు. ఆలయాలను పరిరక్షించటానికి గర్భగుడి ఉండాలనే ఆలోచనలతో అహల్య భాయి నిర్మించారని చెబుతూ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎన్నో ఆలయాలను అహల్యభాయి నిర్మించారని చెప్పారు. 
 
మణికర్ణిక ఘాట్లు వ్యాపారానికి ఉపయోగపడేలా ఒక ఆలోచనతో పరిపాలన ఉండేదని ఆమె తెలిపారు. ఇలాంటి చాలా గొప్ప నిర్ణయాలు ఆలోచనలతో అహల్య భాయి పాలన ఉండేదని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల ఆలోచన ఆదర్శంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆమె ఉద్ఘాటించారు. 11వ ఆర్థిక శక్తిగా ఉండే భారత్ మోదీ హయాంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆమె గుర్తుచేశారు. జపాన్ దేశం కంటే ఆర్థిక శక్తిగా ముందుండే రోజులు రాబోతున్నాయని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

అహల్య భాయి ఒక మహిళగా సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖీ తెలిపారు. 30 సంవత్సరాల పరిపాలనలో అహల్య భాయి వినూత్న ఆలోచనలతో మహారాష్ట్రను వికసిత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆమె చెప్పారు. పీశ్వాలకు ఉత్తర ప్రత్యుత్తరాలతో అహల్య భాయి చాతుర్యతను ప్రదర్శించారని చెప్పారు. మహిళ పీశ్వాలకు సైతం సమాధానం చెప్పి సమాజం కోసం అహల్య భాయి నిలబడ్డారని ఉద్ఘాటించారు. 

ట్రైబల్ మహిళల అభ్యున్నతి కోసం అహల్య భాయి ఆలోచనలు చేశారని తెలిపారు. కాశీ, రామేశ్వరం, శ్రీశైలం లాంటి దేవాలయాల నిర్మాణాలను అహల్య భాయి చేపట్టారని గుర్తుచేశారు. అహల్య భాయి దూర దృష్టితోనే మందిరాల పున:నిర్మాణాలు చేపట్టారని మీనాక్షి లేఖీ పేర్కొన్నారు.