బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌
పొరపాటున అంతర్జాతీయ సరిహద్దుని దాటి పాక్‌ భూభాగంలోకి వెళ్లిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను పాక్‌ ఎట్టకేలకు భారత్‌కు అప్పగించింది. తమ అదుపులో ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్​ పూర్ణమ్ సాహును అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్ బీఎస్ఎఫ్​కు అప్పగించారు. 20 రోజులకు పైగా పూర్ణమ్ కుమార్ పాక్ కస్టడీలో ఉన్నారు.

పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్థాన్ సైన్యం పూర్ణమ్ సాహును అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పూర్ణమ్ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పూర్ణమ్ అప్పగింత మరింత ఆలస్యమైంది.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో బీఎస్​ఎఫ్ 182వ బెటాలియన్‌లో పూర్ణమ్ సాహు పనిచేస్తున్నారు. ఏప్రిల్ 23న అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటాడు. అనంతరం పాకిస్థాన్​ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ సైన్యం సాహును అదుపులోకి తీసుకున్న సమయంలో అతని వద్ద సర్వీస్ రైఫిల్ ఉంది.  అప్పటి నుంచి అతడి విడుదలపై భారత అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.

 ఫిరోజ్‌పూర్‌లో ఇండో-పాక్‌ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులను కాపాడే క్రమంలో అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్థాన్‌ రేంజర్లతో ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిపారు. అయితే, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అప్పగించేందుకు పాక్‌ రేంజర్లు నిరాకరిస్తూ వచ్చాయి. ఆ జవాన్‌ ఆచూకీని కూడా చెప్పలేదు.

సాహు స్వస్థలం పశ్చిమ బంగాల్​లోని హుగ్లీ జిల్లాలోని రిష్రా. పాకిస్థాన్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కుటంబం ఆందోళనకు గురవుతోంది. అతనికి భార్య, ఏడేళ్ల కొడుకు ఉన్నారు.దీంతో జవాను కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.