మ‌సూద్ అజార్‌కు 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం

మ‌సూద్ అజార్‌కు 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం

* ఆపరేషన్ సిందూర్ లో మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్ నజరానా!

ఆప‌రేష‌న్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ఇండియా కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడుల్లో అనేక మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయారు. అయితే జైషే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్, ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్  కుటుంబం ఆ దాడుల్లో హ‌త‌మైంది. మ‌సూద్ అజార్‌కు చెందిన 14 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.  పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ భార‌త్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు కోటి రూపాయాలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు
ఈ నేప‌థ్యంలో మ‌సూద్ అజార్‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద రూ. 14 కోట్లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైమానిక దాడుల్లో మ‌సూద్ అజార్‌కు చెందిన 14 మంది కుటుంబీకులు మ‌ర‌ణించార‌ని, దాని వ‌ల్ల అత‌నికి రూ. 14 కోట్ల ప‌రిహారం ద‌క్కే ఛాన్సు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబీకుల‌కు ఒక్కొక్క‌రికి కోటి ఇవ్వ‌నున్న‌ట్లు ష‌రీఫ్ వెల్ల‌డించారు.
ఆప‌రేష‌న్ సింధూర్‌లో భాగంగా బ‌హ‌వ‌ల్‌పుర్‌లో ఉన్న ఉగ్ర క్యాంపుల‌ను దాడి చేసిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌లోని 12వ అతిపెద్ద న‌గ‌రం అది. జేషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర సంస్థ‌కు చెందిన ఆప‌రేష‌న్ కేంద్రం ఆ సిటీలో ఉన్న‌ది. లాహోర్‌కు సుమారు 400 కిలోమీట‌ర్ల దూరంలో బ‌హ‌వ‌ల్‌పుర్ ఉన్న‌ది. జేషే హెడ్‌క్వార్ట‌ర్స్ ఇక్క‌డే ఉంది. జామియా మ‌జ్జీద్ సుభాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంప‌స్ అని కూడా ఆ ప్రాంతాన్ని పిలుస్తుంటారు.
వైమానిక దాడుల్లో త‌న సోద‌రి, ఆమె భ్త‌ర్త‌, మేన‌ల్లుడు.. అత‌ని భార్య‌, మ‌ర‌ద‌లు, మ‌రో అయిదు మంది చిన్నారులు మ‌ర‌ణించిన‌ట్లు మ‌సూద్ అజార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే.  మ‌సూద్ అజార్ కుటుంబంలో ప్ర‌స్తుతం అతనొక్క‌డే బ్ర‌తికి ఉన్న‌ట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందికి అత‌నే వార‌సుడు కాబ‌ట్టి, పాక్ ప్ర‌భుత్వం ఇచ్చే రూ.14 కోట్లు అత‌నికే ద‌క్కుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ త‌న ప్ర‌క‌టన‌లో బాధిత కుటుంబాల‌కు ఇండ్లు కూడా క‌ట్టిస్తామ‌ని పేర్కొన్నారు.