* ముగ్గురి పేర్లు తిరస్కరించిన గవర్నర్
వివిధ రంగాలకు సంబంధించిన నలుగురిని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియమించారు. జర్నలిస్టులు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్‌లను ఎస్‌ఐసీలుగా నియమించేందుకు సోమవారం ఆమోదముద్ర వేశా రు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కమిషనర్ల నియామక ఉత్తర్వులను జారీచేశారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. ఇప్పటికే రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా ఐఎ్‌ఫఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు. ఆర్‌టీఐ రాష్ట్ర కమిషనర్లుగా ఏడుగురిని నియమించాలని ప్రభు త్వం మొదట్లో నిర్ణయించింది.
పీవీ శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, వైష్ణవి, కేఎల్‌ఎన్ ప్రసాద్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, రాములు, మొహిసినా పర్వీన్.. ఇలా ఏడుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గరవ్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫైలును పంపించింది.
ఇందులో కొంత మందిపై గవర్నర్‌కు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం నలుగురి పేర్లను ఖరారు చేసింది. ముగ్గురిని గవర్నర్ తిర్కరించగా, ఒకరి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు. కప్పర హరిప్రసాద్ తన దరఖాస్తులో తెలంగాణ ప్రదేశ్ కాగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ప్రచార కార్యదర్శి అని పేర్కొనడంతో ఆయనను తిరస్కరించినట్లు తెలిసింది. సాధారణంగా న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతికం, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో నిష్ణాతులను ఆర్‌టీఐ రాష్ట్ర కమిషనర్లుగా నియమిస్తారు.
కప్పర హరిప్రసాద్ తాను కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అని పేర్కొనడంతో పార్టీ అనుబంధ వ్యక్తిగా భావించి, ఆయన పేరును తిరస్కరించినట్లు సమాచారం. వైష్ణవికి సామాజిక సేవా నేపథ్యం లేనందున తిరస్కరించారు. కేఎల్‌ఎన్ ప్రసాద్ కోదాడలో ఎన్నికల్లో పోటీ చేశారని, అందుకే తిరస్కరించారని రాజ్‌భవన్ వర్గాల ద్వారా తెలిసింది. న్యాయవాది రాములు పేరు పరిశీలనకు వచ్చినా ఆయన స్థానంలో మరో న్యాయవాది, కొడంగల్‌కు చెందిన దేశాల భూపాల్‌కు అవకాశం కల్పించారు.
ఇలా ముగ్గురి పేర్లను రాజ్‌భవన్ తిరస్కరించగా, రాములు స్థానంలో భూపాల్‌కు అవకాశమిచ్చింది. వాస్తవానికి ఆర్‌టీఐ కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఫైలును పక్షం రోజుల కిందటే ప్రభు త్వం రాజ్‌భవన్‌కు పంపించింది. ఫిర్యాదుల నేపథ్యం లో నియామకాల్లో ఆలస్యం జరిగింది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని యుద్ధ వాతావరణ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. ఇదే సందర్భంలో ఆర్‌టీఐ కమిషనర్ల గురించి చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చిన కొంత సేపటికే ఆర్‌టీఐ కమిషనర్ల నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!