ఎప్పటికప్పుడు నకిలీ వార్తలను తిప్పికొడుతున్న భారత్‌!

ఎప్పటికప్పుడు నకిలీ వార్తలను తిప్పికొడుతున్న భారత్‌!
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశం తప్పుడు ప్రచారంతో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత సైన్యం ధాటికి పలాయనం చిత్తగిస్తున్నా తామే దాడులు చేశామని, తమదే పైచేయి అన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నది. పాకిస్తాన్‌ ఆర్మీ, టీవీ చానళ్లు, సోషల్‌మీడియా సైట్లను మొత్తం నకిలీ కధనాలతో నింపేశారు. 
పాక్‌ ఫేక్‌ ప్రచారానికి భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) దీటుగా బదులిచ్చింది. పాక్‌ ఫేక్‌ ప్రచారం పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రచారం : 3భారత ఫైటర్‌ జెట్స్‌ కూలాయి.
వాస్తవం : పాకిస్థాన్‌ అనుకూల వ్యక్తులు సోషల్‌ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారమిది. 2016లో జోద్‌పూర్‌లో మిగ్‌ 27 కూలినప్పటి ఫొటో.

ప్రచారం: భారత సైనికులు పారిపోతున్నట్టుగా వీడియో పోస్ట్‌ చేశారు.
వాస్తవం: ఈ వీడియో భారత సైన్యానికి సంబంధించినది కాదు. ఓ ప్రైవేట్‌ డిఫెన్స్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు భారత సైన్యంలో ఎంపికైన సందర్భంలో సంతోషంలో భావోద్వేగానికి గురైన వీడియో అది.

ప్రచారం: భారత్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థ ఎస్‌-400ను పాకిస్థాన్‌ ధ్వంసం చేసిందా? ఇదిగో నిజం. జేఎఫ్‌-17 జెట్‌ ద్వారా ప్రయోగించిన హైపర్‌ సోనిక్‌ క్షిపణి ఆడమ్‌పూర్‌లోని రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు.
వాస్తవం: ఈ ప్రచారం పూర్తిగా నిరాధారం. ఎస్‌ -400 వ్యవస్థ విధ్వంసం జరగలేదు.

ప్రచారం: భారత ఎయిర్‌ ఫోర్స్‌ మహిళా పైలట్‌, స్కాడ్రన్‌ లీడర్‌ శివానిసింగ్‌ పాకిస్థాన్‌కు పట్టుబడ్డారని, జెట్‌ నుంచి దిగుతుండగా పాకిస్తాన్‌ పట్టుకుందని వీడియో వైరల్‌.
వాస్తవం: ఈ వార్తలో నిజంలేదు. భారత పైలెట్లను పాకిస్థాన్‌ సైన్యం పట్టుకోలేదు.

ప్రచారం: పీవోకేపై భారతీయ పైలట్‌ యుద్ధ విమానం నుంచి దూకినట్టు వైరల్‌ పోస్టు.
వాస్తవం: ఇది తప్పుడు సమాచారం. పీవోకేలో భారతీయ పైలట్‌ ఎవరూ దూకలేదు.

ప్రచారం: ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై క్షిపణిదాడి జరిగిందని మరో వార్త వైరల్‌.
వాస్తవం: ఇది పాత వీడియో. ఈ వీడియో 2024 ఆగస్టులో యెమెన్‌లోని అడెన్‌లో జరిగిన గ్యాస్‌ స్టేషన్‌ పేలుడు వీడియో.

ప్రచారం: భారత్‌లోని భటిండా ఎయిర్‌ఫీల్డ్‌ ధ్వంసమయ్యిందంటూ పోస్ట్‌ వైరల్‌
వాస్తవం: ఇది కూడా ఫేక్‌ వార్తే. భటిండా ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి ఆపరేషన్స్‌ సజావుగా నడుస్తున్నాయి.

ప్రచారం: నగ్రోటా వైమానిక స్థావరంపై దాడి జరిగిందని మరో పోస్టు వైరల్‌
వాస్తవం: ఇది పాత వీడియో. అక్టోబర్‌ 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ప్రచారం: ఉదంపూర్‌ వైమానిక స్థావరం ధ్వంసమైనట్టు ఏఐకే న్యూస్‌ టీవీ ఓ వీడియో ప్రసారం చేసింది. ఈ స్థావరాన్ని పాకిస్థాన్‌ ధ్వంసం చేసినట్టు పేర్కొన్నది.
వాస్తవం: హనుమాన్‌గఢలోని ఓ కార్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదం వీడియో.

ప్రచారం: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానం కూలిందని వీడియో వైరల్‌.
వాస్తవం: 2025 మార్చిలో జాగ్వార్‌ శిక్షణ విమానం కూలిపోయిన వీడియో.