ఉద్రిక్తతలు తగ్గించమని జీ7 దేశాల విజ్ఞప్తి

ఉద్రిక్తతలు తగ్గించమని జీ7 దేశాల విజ్ఞప్తి
ఉద్రిక్తతలు తగ్గించాలని జీ7 దేశాలు భారత్‌-పాకిస్తాన్‌ని కోరాయి. కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ దేశాలు సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో కోరాయి.  సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, రెండువైపులా పౌరుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. 
తక్షణం ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితి శాంతించేందుకు ఇరుదేశాలు చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సమస్యకు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం విషయంలో తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో జీ7 దేశాలు తెలిపాయి.
 
“మరిన్ని సైనిక ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. రెండు వైపులా పౌరుల భద్రత పట్ల మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము” అని జి7 సభ్యుడైన కెనడా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. “మేము సంఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాము. వేగవంతమైన, శాశ్వత దౌత్యపరమైన తీర్మానానికి మా మద్దతును తెలియజేస్తున్నాము” అని ప్రకటించారు. 
 
 “మేము, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికాల  జి7 విదేశాంగ మంత్రులు, ఐరోపా యూనియన్ ఉన్నత ప్రతినిధి, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం, పాకిస్తాన్ రెండింటి నుండి గరిష్ట సంయమనాన్ని కోరుతున్నాము” అని ప్రకటన పేర్కొంది.
 
ఇదిలా ఉండగా, సింగపూర్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న “సైనిక ఘర్షణ” గురించి “తీవ్రంగా ఆందోళన చెందుతోంది” అని పేర్కొంది.  పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉద్రిక్తతలను శాంతింపజేయాలని రెండు దేశాలను కోరింది.  మరోవంక, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనా తన వైఖరిపై మాట మార్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా శాంతి, సుస్థిరతకు సంబంధించిన విశాల ప్రయోజనాల కోసం భారత్‌, పాక్‌ ప్రశాంతంగా ఉండాలని సూచించింది. 
 
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అంతర్జాతీయ సమాజంతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ స్పష్టం చేశారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా ఖండిస్తున్నట్లు కూడా పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిణామాలపై చైనా ఆందోళన చెందుతోందని, భారత్‌, పాకిస్థాన్‌ ఇప్పుడు, ఎప్పుడూ ఇరుగు పొరుగు దేశాలేనని ఆమె స్పష్టం చేశారు.