 
                పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో కచ్చితంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. 
‘‘ఎన్ఈపీ-2020 అమలు చేయాలా వద్దా అనేది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. ఆర్టికల్ 32 ప్రకారం ప్రజల హక్కులు పరిరక్షించేలా చూడటానికే ఆదేశాలు ఇవ్వగలం. ఎన్ఈపీ-2020 లాంటి పాలసీలను అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేం. ఎన్ఈపీ విషయంలో ఏ రాష్ట్రమైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రమే జోక్యం చేసుకోగలం. అందువల్ల ఈ పిటిషన్‌ను విచారించలేం’’ అని ధర్మాసనం వెల్లడించింది. 
అయితే ప్రధాన సమస్య విషయంలో తగిన ప్రొసీడింగ్స్‌లో విచారణ చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది.  తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాజ్యాంగపరంగా విద్యావిధానాన్ని అమలుచేయాలని పేర్కొంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపకతను నెలకొల్పడానికి కేంద్రం ఎన్ఇపి విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోందని, పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనవసరంగా రాజకీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 
ఈ కేసుతో తనకేం సంబంధం ఉందని సుప్రీంకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించగా తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని, ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డానని తెలిపారు. దేశ రాజధానిలో స్థిరపడినప్పుడు వివిధ రాష్ట్రాల్లో జాతీయ విద్యావిధానం అమలు గురించి పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. తన పిల్లలు ఢిల్లీలో హిందీ నేర్చుకోవడం కొనసాగించవచ్చని పిటిషనర్‌కు తెలిపింది.
ఎన్ఇపి విషయంలో తమిళనాడు – కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. రాజకీయ అభిప్రాయ విభేదాలకు అతీతంగా దీన్ని అమలుచేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఓ లేఖలో సూచించారు. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పలుమార్లు స్పష్టంచేశారు. మరోవైపు జాతీయ విద్యావిధానాన్ని ఆమోదిస్తేనే తమిళనాడుకు నిధులు విడుదలవుతాయంటూ కేంద్ర ప్రభుత్వం షరతులు పెడుతోందని ఆరోపించారు. 
                            
                        
	                    




More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు