తెలుగు భక్తుల కోసం అయోధ్య, కాశీలో భూమి కేటాయించండి

తెలుగు భక్తుల కోసం అయోధ్య, కాశీలో భూమి కేటాయించండి

తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్య శ్రీరామ మందిరం, కాశీ విశ్వనాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయోధ్య శ్రీ రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ వినతి పత్రం అందజేశారు.

భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందని తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కాశీ, అయోధ్యలో వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటి నిర్మాణానికి అవసరమైన భూమిని – కనీసం 2000 చదరపు గజాల నుండి 1 ఎకరం వరకు కేటాయించాలని కోరారు.

భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను చేశారు. ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్‌లో తెలుగు భక్తుల యాత్ర మరింత సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.