
తమ దేశంలో ఆశ్రయం పొందేందుకు విద్యా, ఉద్యోగ వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తామని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. వీలైనంత త్వరగా అలాంటి వాళ్లను గుర్తించేందుకు సమాచార సేకరణ చేస్తున్నామని వెల్లడించింది. ఈమేరకు చేపట్టనున్న చర్యల వివరాలతో మే నెలాఖరులోగా ‘వలసదారులపై శ్వేతపత్రం’ను యూకే హోంశాఖ విడుదల చేయనుంది.
స్టడీ, వర్క్ వీసాలతో యూకేకు వస్తున్న పాకిస్తాన్ జాతీయుల్లో అత్యధికులు ఆశ్రయం కల్పించాలంటూ యూకే హోంశాఖకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ విధంగా పాకిస్థానీయుల నుంచి వెల్లువెత్తుతున్న దరఖాస్తులు గత సంవత్సరం 79 శాతం మేర పెరిగి 10,542కు చేరడం గమనార్హం. అందుకే ఈ అంశంపై యూకే ప్రభుత్వం ప్రస్తుతం సీరియస్ ఫోకస్ పెట్టింది.
‘‘మా దేశ వీసా వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. దాని తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షిస్తాం. మా దేశ వలస నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. దారితప్పిన యూకే వలస విధానాన్ని గాడిన పెట్టే సమగ్ర ప్రణాళికతో కూడిన వలస విధానపు శ్వేతపత్రాన్ని (ఇమిగ్రేషన్ వైట్ పేపర్) త్వరలోనే విడుదల చేస్తాం’’ అని యూకే హోం శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
బ్రిటన్ హోంశాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం యూకేలో ఆశ్రయం పొందేందుకు 2024లో అత్యధిక దరఖాస్తులు సమర్పించిన టాప్ – 10 విదేశీయుల జాబితాలో భారతీయులు ఆరో స్థానంలో నిలిచారు. యూకేలో ఆశ్రయం కోరుతూ భారతీయులు సమర్పించిన దరఖాస్తుల్లో కేవలం 1 శాతమే ఆమోదం పొందాయి.
ఇక ఇదే సమయంలో పాకిస్థానీయులు, ఆఫ్గనిస్థాన్‌వాసుల దరఖాస్తుల్లో 53 శాతం, ఇరానీయుల దరఖాస్తుల్లో 64 శాతం ఆమోదం పొందాయి. యూకేలో ఆశ్రయం కోసం బంగ్లాదేశీయులు సమర్పించిన దరఖాస్తుల్లో 19 శాతం, సిరియావాసుల దరఖాస్తుల్లో 98 శాతం, వియత్నాం జాతీయుల దరఖాస్తుల్లో 25 శాతం, ఎరిత్రియా జాతీయుల దరఖాస్తుల్లో 87 శాతం, సూడాన్ జాతీయుల దరఖాస్తుల్లో 99 శాతం, ఇరాకీయుల దరఖాస్తుల్లో 32 శాతం ఆమోదం పొందాయి.
వివిధ వీసాలతో యూకేకు వచ్చిన వారిలో దాదాపు 40వేల మంది ఆశ్రయం కల్పించాలని కోరుతూ 2024 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 16 వేలమంది విద్యార్థి వీసాపై, 11,500 మంది వర్క్ వీసాపై, 9,500 మంది విజిటర్ వీసాపై యూకేకు వచ్చారు. ప్రస్తుతం యూకేకు సంబంధించిన నికర వలస సంఖ్య అనేది 7.28 లక్షలుగా ఉంది.
దేశంలోకి వచ్చే వలసదారుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రాబోయే కొన్నేళ్లలో వారి సంఖ్యను తగ్గించాలని యూకే సర్కారు భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్రిటన్ వలసదారులను వ్యతిరేకిస్తూ గతవారం జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన నైజెల్ ఫారేజ్ సారథ్యంలోని విపక్ష పార్టీ ఘన విజయం సాధించింది.
ఈ ఫలితంతో సదరు విపక్ష పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ పరిణామంతో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. వలసదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీల వల్ల బ్రిటన్ పౌరులపై పన్ను భారం పెరుగుతోందని నైజెల్ ఫారేజ్‌కు చెందిన రాజకీయ పార్టీ వాదిస్తోంది. అందుకే ఇప్పుడు వీసాలను దుర్వినియోగం చేసే విదేశీయులపై బ్రిటన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు