సింధు నదీ జలాలు ఇక మనకే

సింధు నదీ జలాలు ఇక మనకే
ఇప్పటి వరకు ఇతరులకు ఇచ్చిన మన నీళ్లు ఇకపై మనకేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏబీపీ మీడియా గ్రూప్‌ మంగళవారం నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడుతూ భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పొరుగు దేశం పేరు ఎత్తలేదు. ‘‘ఇక భారత జలాలు భారత్‌ కోసమే ప్రవహిస్తాయి… నిల్వ ఉంటాయి.. దేశ ప్రయోజనాలకే వినియోగమవుతాయి…’’ అని ప్రధాని మోదీ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు. 

తద్వారా సింధు నది జలాల విషయంలో భారత్‌ అనుసరించనున్న వైఖరిని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌కు వెళ్లే సింధూ నదీ జలాలను అడ్డుకుంది. దీంతో ఇప్పటికే సాగు, తాగు నీరు లేక అల్లాడుతున్న పాక్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల వేళ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు.

గతంలో భారత జలాలు బయటి దేశాలకు వెళ్లేవని, ఇప్పుడు మన దేశంలో ప్రవహించే నీరంతా మన దేశంలోనే ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. మన దేశంలో ప్రహించే నీటిని మన దేశ అవసరాలకే వాడుకుందామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని జలాలను దేశీయ అవసరాలకే వినియోగిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలోనే “మన దేశం- మన నీళ్లు- మన హక్కు” అనే నినాదాన్ని వినిపించారు.

గతంలో భారతీయ హక్కులు విదేశాల్లో ఉప్పొంగేవని, కానీ ఇక ముందు భారతీయ భూభాగంలో పారే జలాలు ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం, వారి పురోభివృద్ధి కోసమే మన భూభాగంపైనే ఉప్పొంగి ప్రవహిస్తాయని ప్రధాని తేల్చి చెప్పారు.  ఇక నుంచి మన జలాలు మన దేశ అభివృద్ధికి, ప్రయోజనాలకు మాత్రమే వినియోగించబడతాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆ నీటిని మనమే నిల్వ చేసుకుంటామని తేల్చి చెప్పారు.
 
1961లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం సింధూ నదికి సంబంధించి భారత్‌కు హక్కు ఉన్న నీటిని ఇప్పటివరకు కొంతవరకు మాత్రమే భారత్ ఉపయోగించుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా పూర్తి హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 23వ తేదీన జరిగిన భద్రతపై మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఈ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమ ప్రభుత్వం గత పదేళ్లలో దేశ ప్రయోజనాల కోసం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుందని, కానీ గత ప్రభుత్వాలు ఈ విధంగా దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేశాయని ప్రధాని విమర్శించారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తోందో అని ప్రజలు యోచిస్తుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు తాము ఓట్లు పొందగలుగుతామా లేదా తమ పదవి పదిలమా లేదా అని ఆలోచించేవని, అందువల్లనే ముఖ్యమైన సంస్కరణలు ఆలస్యమయ్యేవని విమర్శించారు. ఈ విధంగా ఏదేశం ముందుకు వెళ్లలేదని ప్రధాని పేర్కొన్నారు.