జమ్ముకశ్మీర్‌లో ముష్కరదాడి తర్వాత విదేశీ పర్యటనను సైతం ప్రధాని మోదీ కుదించుకుకొని, భద్రత వ్యవహారాల సమీక్షలతో తీరికలేని పరిస్థితుల్లో కూడా రాజధాని పునఃప్రారంభానికి ప్రధాని రావడం రాష్ట్రంపై ఆయనకు ఏపీపై ఉన్న నిబద్ధతకు నిదర్శమని బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్రాజుస్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులు ఏ మాత్రం సంకోచించాల్సిన పని లేదని ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
ఆంధప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా అమరావతి పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ని వేల కోట్లయినా కేటాయించి వికసిత ఆంధ్రప్రదేశ్‌గా, వికసిత భారత్‌లో ఓ భాగంగా చేసేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వారు చెప్పారు. అమరావతి పునఃప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల వారు సంతోషంవ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్సీపీ నాయకులతోపాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేస్తోన్న ప్రకటనలను బీజేపీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. జగన్‌పై ఉన్న కేసులు కోర్టులో విచారణకు వస్తున్నాయని వెల్లడించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఆయనకు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదుల కంటే జగన్ పెద్ద ముష్కరుడని విమర్శించారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన ఏపీని తిరిగి స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. “రాష్ట్రానికి ప్రధాని ఎన్నో చేశారు. గృహనిర్మాణంలో ఎక్కువ ఇళ్లు ఇచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లెల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇవి కాకుండా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. ఇవేవీ వైఎస్సార్సీపీ నేతలకు, షర్మిలకు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు
ఉగ్రదాడి తర్వాత మోదీ రష్యా పర్యటన కూడా రద్దు చేసుకున్నారని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని శుక్రవారం నాడు అమరావతికి వచ్చారని చెప్పారు. రాజధాని విషయంలో జగన్ ప్రజలను భయపెట్టారని తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి అన్నివిధాలుగా తథ్యమని పేర్కొన్నారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ