ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సుబ్రమణియన్ తొలగింపు

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా  సుబ్రమణియన్ తొలగింపు
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సేవలను భారత్ ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. మూడేళ్ళ పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఆయనను ఈ పదవి నుండి తొలగిస్తూ ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుంది.
 
సిబ్బంది మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో “అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (భారతదేశం)గా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సేవలను తక్షణమే రద్దు చేయడాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది” అని తెలిపింది. సుబ్రమణియన్ ఆగస్టు 2022లో ఐఎంఎఫ్ లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ ల ప్రతినిధిగాఈ పదవిని చేపట్టారు. 
 
అంతకు ముందు, ఆయన 2018 నుండి 2021 వరకు భారత ప్రభుత్వానికి 17వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు,ఈ పదవిలో పనిచేసిన అత్యంత పిన్నవయస్కుడిగా పేరొందారు. అక్కడ ఆయన నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక విధాన ప్రణాళికకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రసిద్ధి చెందారు. సుబ్రమణియన్ నిష్క్రమణకు గల కారణాలు అధికారికంగా ప్రకటించలేదు.
 
ప్రభుత్వం త్వరలో ఆయన స్థానంలో ఐఎంఎఫ్ బోర్డుకు తమ ప్రతినిధిని నామినేట్ చేయబడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎంఎఫ్ డేటాసెట్‌ల గురించి సుబ్రమణియన్ ప్రశ్నలు లేవనెత్తడం బహుపాక్షిక సంస్థ కారిడార్లలో అసంతృప్తికి దారితీసినట్టు తెలుస్తోంది.  అంతేకాకుండా, తన తాజా పుస్తకం “India@100” ప్రమోషన్, ప్రచారంలో చూపిన ఆసక్తి సహితం విమర్శలకు దారితీసిన్నట్లు చెబుతున్నారు.
 
కాగా, ఐఎఫ్ఎఫ్ ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో, 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపివృద్ధి అంచనాను 6.2%కి సవరించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా నుండి ప్రతీకార సుంకాలు, దేశీయ సవాళ్ల వల్ల ఏర్పడిన ప్రపంచ వాణిజ్య అంతరాయాలను పేర్కొంటూ, ఈ అంచనాను జనవరి అంచనా నుండి 0.3 శాతం పాయింట్లు తగ్గించారు.
 
డౌన్‌గ్రేడ్ ఉన్నప్పటికీ, బలమైన ప్రైవేట్ వినియోగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశపు వృద్ధి అంచనా సాపేక్షంగా స్థిరంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి వాతావరణం మధ్య ఐఎంఎఫ్ చాలా ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు వృద్ధి అంచనాలను తగ్గించినందున, తగ్గుతున్న సవరణ విస్తృత ధోరణిలో భాగమని నివేదిక సూచించింది. ఐఎంఎఫ్ కార్యనిర్వాహక బోర్డులో సభ్య దేశాలు లేదా దేశాల సమూహాలు ఎన్నుకున్న  25 మంది డైరెక్టర్లు ఉంటారు.