ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు జిఎస్‌టి

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు జిఎస్‌టి
ఏప్రిల్‌లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) స్థూల వసూళ్లు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు పెరిగాయు. 2024 ఏప్రిల్‌లో నమోదైన రూ.2.10 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతోపాటు వ్యాపారుల ఆర్థిక సంవత్సరాంతర సర్దుబాట్లు ఇందుకు దోహదపడ్డాయి. 
ఎందుకంటే, వ్యాపారులు మార్చి నెల ఆర్థిక లావాదేవీలపై జిఎస్‌టిని ఏప్రిల్‌లో చెల్లిస్తారు.
2017 జూలై నుంచి  జిఎస్‌టి చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇది రెండోసారి. వసూళ్లలో రెండో అత్యధిక రికార్డుతో పాటు గతంలో రూ.2 లక్షల కోట్లకు పైగా వసూళ్లు కూడా క్రితం ఏడాది ఏప్రిల్‌లోనే నమోదు కావడం గమనార్హం.  కాగా, ఈ మార్చిలో వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది.  గతేడాది ఇదే నెల వసూళ్లతో పోల్చితే 12.6 శాతం పెరుగుదల నమోదయ్యిందని తెలిపింది.
దీంతో ప్రజలపై అమలు చేస్తోన్న హెచ్చు పన్నులు సర్కార్‌ ఖజానాను గలగలలాడేలా చేస్తోన్నాయని స్పష్టమవుతోంది. 2024 ఇదే ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది.  జిఎస్‌టి విధానాన్ని 2017 జులై నుంచి అమల్లోకి తెచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లలో ఏప్రిల్‌ 2025 నిలిచిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. తొలి సారి రూ.92వేల కోట్లతో ప్రారంభమైన జిఎస్‌టి వసూళ్లతో పోల్చితే ఆరేళ్లలోనే రెండున్నర రెట్ల మేర పెరగడం విశేషం.
గడిచిన ఏప్రిల్‌ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీలు 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతైన వస్తువులపె జిఎస్‌టి ఆదాయం 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు పెరిగింది. రూ..27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జిఎస్‌టి వసూళు రూ.2.09 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2018 ఏప్రిల్‌లో తొలిసారి జిఎస్‌టి వసూళ్లు రూ.1లక్ష కోట్లు దాటాయి. తొలిసారి 2024 ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మార్కు దాటింది.

“జి ఎస్ టీ ఆదాయ తాజా గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత, సహకార సమాఖ్యవాద ప్రభావానికి నిదర్శనం. వసూళ్లు రికార్డు స్థాయికి చేర్చటంలో పాలు పంచుకున్న పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు. పన్ను వసూళ్ల వృద్ధిలో కేంద్ర, రాష్ట్ర జీఎ్‌సటీ అధికారుల పాత్ర ఎంతో ఉంది” అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

కాగా, ఏప్రిల్‌ 2025లో తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గగా, తెలంగాణలో జిఎస్‌టి రాబడి పెరిగింది. తెలంగాణలో 12 శాతం వృద్ధితో రూ.6,983 కోట్ల జిఎస్‌టి వసూళ్లు జరిగాయి. గతేడాది ఇదే ఏప్రిల్‌లో రూ.6,236 కోట్లుగా నమోదయ్యాయి. కాగా గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జిఎస్‌టి వసూళ్లు 3 శాతం తగ్గి రూ.4,686 కోట్లకు పరిమితమయ్యాయి. 2024 ఇదే నెలలో ఎపిలో రూ.4,850 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది.