అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీం తీర్పు రిజర్వ్

అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీం తీర్పు రిజర్వ్
 
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్‌ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని చట్టం సూచిస్తుంది. ఈ నిబంధన అమలు చేయాలని కోరుతూ డాక్టర్‌ కె. పురుషోత్తమ్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంపునకు పునర్విభజన ప్రక్రియను ప్రారంభించే విధంగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పును రిజర్వు చేసింది. 
 
ఈ కేసు రాజకీయ, రాజ్యాంగ దృష్ట్యా రెండు రాష్ట్రాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను మినహాయించి, కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలను మాత్రమే డిలిమిటేషన్‌ చేయడం అసమంజసమైనదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. 
 
ఈ పిటిషన్‌పై కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతి స్పందనలను కూడా సుప్రీంకోర్టు కోరింది. డిలిమిటేషన్‌ కమిషన్‌ నోటిఫికేషన్లో రాష్ట్రాలను చేర్చడం, మినహాయించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని పేర్కొన్న ఎన్నికల కమిషన్‌ అఫిడవిట్‌ను న్యాయవాది ప్రస్తావించారు.  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కెఎం నటరాజ్‌ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం ఈ ప్రక్రియ 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిలిమిటేషన్‌ అనేది రాత్రికి రాత్రే చేపట్టలేని ఒక భారీ కసరత్తు అని తెలిపారు. అప్పటి వరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
ఆర్టికల్ 82లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని కేంద్రం స్పష్టం చేసింది. జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే అసెంబ్లీ సీట్లను పెంచగలమని తేల్చిచెప్పింది.  పిటిషనర్‌ లేవనెత్తిన జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ కేంద్రపాలిత ప్రాంతం విషయంలో జరిగిందని ఎఎస్‌ జి చెప్పారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం చట్టపరమైనదే అని పేర్కొన్నారు.