
* జమ్ము కశ్మీర్‌లోనే పెహల్‌గామ్ ఉగ్రవాదులు..!
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. దీనిని భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ 30-మే1 అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌లోని మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీటికి భారత్ ఆర్మీ దళాలు వేగంగా స్పందించాయని ఓ అధికారి పేర్కొన్నారు. అటూ బారాముల్లా, పూంచ్ జిల్లాల్లోనూ కవ్వింపు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది.
ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజూ పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీటుగా భారత్ ఆర్మీ బదులిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడవడంపై భారత్ హెచ్చరికలు జారీచేసింది.
ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైన్ ద్వారా మాట్లాడుకున్నారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నియంత్రరేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కాల్పులు జరపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపిందని చెప్పాయి. ఇకపై ఎలాంటి కవ్వింపుల లేకుండా ఉల్లంఘనలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో పాకిస్థాన్ ఏ రోజు ఏయో ప్రాంతాల్లో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించినట్లు సమాచారం.
ఇలా ఉండగా, బైసరాన్ వ్యాలీలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా జమ్ము కశ్మీర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రఘటన జరిగి వారం రోజులు గడిచినా దాడికి పాల్పడిన ముష్కరులు మాత్రం ఇంకా కశ్మీర్‌లోనే దాగి ఉన్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దక్షిణ కశ్మీర్ లో తలదాచుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు తాజాగా వెల్లడించాయి.
ఒకవేళ భద్రతా బలగాలు వారిని గుర్తించి కాల్పులు జరిపితే కవర్ ఫైర్ చేసేలా మరింతమంది ముష్కరులను వీరికి బ్యాకప్‌గా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉనికి బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సదరు వర్గాలు గుర్తించాయి. ఆహార సామగ్రితోపాటు ఇతర ముఖ్యమైన వస్తువులను తమవెంట తీసుకెళ్లినట్లు గుర్తించామని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.
అటవీ ప్రాంతంలో ఎక్కువ కాలం గడిపినా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు