కర్రెగుట్టలపై జాతీయ పతాకం రెపరెపలు

కర్రెగుట్టలపై జాతీయ పతాకం రెపరెపలు
ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన ములుగు జిల్లాకు సమీపంలో గల కర్రెగుట్టల్లో భద్రతా దళాలు జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న విస్తృత ఆపరేషన్‌లో భాగంగా బలగాలు తాజాగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.  బ్లాక్‌హిల్స్‌గా పిలువబడే ఈ కొండల్లో మావోల కోసం బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇప్పటికే చుట్టుపక్కల అన్ని సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న దళాలు, తాజాగా కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఎగురవేయడం మావోలకు పెద్ద ఎదురుదెబ్బగా పలువురు భావిస్తున్నారు.  భరించలేని 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలు అలసిపోవడంతో, వారి స్థానంలోకి బ్యాకప్ బలగాలను తరలించారు. మావోయిస్టుల జాడను కనిపెట్టేందుకు భద్రతా దళాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో పాటు డ్రోన్ల సహాయంతో నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మంగళవారం నడిపల్లి, పూజారీ, కాంకేర్ ప్రాంతాల్లో బాంబుల శబ్ధాలు వినిపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) చీఫ్ తపన్ దేకా రంగంలోకి దిగారు. ఆయన రాయ్‌పూర్‌లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించి ఆపరేషన్ పురోగతిపై సమీక్షించారు. మొత్తానికి కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగురవేయడం భద్రతా దళాలకు ము ఖ్యమైన విజయంగా అభివర్ణిస్తున్నారు.