
మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. లోక్‌సభలోని 75 మంది మహిళా ఎంపీల్లో ఆరుగురు, రాజ్యసభలోని 37 మంది మహిళా ఎంపీల్లో ముగ్గురు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది తమను తాము బిలియనీర్లుగా ప్రకటించుకున్నట్టు వెల్లడించింది.
మొత్తం 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 512 మంది ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారని, వారిలో 143 (28 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది. లోక్‌సభ మహిళా ఎంపీల్లో 24 (32 శాతం) మంది, రాజ్యసభ మహిళా ఎంపీల్లో 10 (27 శాతం) మంది, మహిళా ఎమ్మెల్యేల్లో 109 (27 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
78 మంది మహిళా చట్టసభ సభ్యులు హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని, వారిలో 14 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు పేర్కొన్నది. కాగా, రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గోవాకు చెందిన ముగ్గురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఇద్దరు (67) శాతం, తెలంగాణలోని 12 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 8 మంది (67 శాతం), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మందిలో 14 మంది (58 శాతం), పంజాబ్‌కు చెందిన 14 మందిలో 7 మంది (50 శాతం), కేరళ నుంచి 14 మందిలో 7 మంది (50 శాతం), బీహార్ నుంచి 35 మందిలో 15 మంది (43 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి.
మరోవైపు పార్టీల పరంగా పరిశీలిస్తే అత్యధికంగా మొత్తం 217 మంది బీజేపీ మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 11 శాతం మందిపై తీవ్రమైన నేర అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని 83 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా 34 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 20 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 20 మంది మహిళా చట్టసభ్యుల్లో 65 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 45 శాతం మందిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 13 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 69 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 31 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్