బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మయ్‌ దాస్‌కు బెయిల్

బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మయ్‌ దాస్‌కు బెయిల్

బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్‌ కృష్ణ దాస్‌కు  బెయిల్‌ లభించింది. ఆరు నెలలుగా జైలులో ఉన్న ఇస్కాన్ మాజీ పూజారికి బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. చిన్మయ్‌ దాస్ అనారోగ్యంతో ఉన్నారని, ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారని ఆయన తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 

గత ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఈ సందర్భంగా అల్లరిమూకలు ఆ దేశంలోని హిందువులు, హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. కాగా, రంగ్‌పూర్‌లో జరిగిన హింసను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో చిన్మయ్‌ కృష్ణ దాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలపై నవంబర్ 25న ఢాకాలో ఆయనను అరెస్ట్‌ చేశారు.

దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇస్కాన్‌తో సంబంధం ఉన్న ఆయనతోపాటు 17 మంది హిందువుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. మరోవైపు నవంబర్ 26న ఛటోగ్రామ్ కోర్టు చిన్మయ్‌ దాస్‌కు రిమాండ్‌ విధించి జైలుకు పంపింది. డిసెంబర్ 11న అదే కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించింది. దీంతో చిన్మయ్‌ కృష్ణ దాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అరెస్టైన ఆరు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ మంజూరైంది.