
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ను అన్ని అంశాల్లోనూ ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే పాక్‌కు దౌత్యపరంగా స్థాయిని తగ్గించడం, వాణిజ్యాన్ని నిషేధించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇకపై వాయు, జల మార్గాలనూ మూసేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రస్థాయిలో స్పందించడంతో భారత విమానాలకు పాక్ తన గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అదే తరహాలో పాక్ విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. దీనివల్ల పాకిస్థాన్ నుంచి తూర్పు వైపునకు.. అంటే మయన్మార్, థాయిలాండ్, మలేసియా వంటి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లాలంటే.. చైనా మీదుగా, లేదా శ్రీలంక మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అంత ఎక్కువ దూరం తిరగడం వల్ల పాక్ విమానయాన సంస్థలకు పెద్ద దెబ్బే తగలనుంది. మరోవైపు భారత పోర్టుల్లో పాకిస్థాన్ నౌకలు ఆగకుండా నిషేధం విధించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధించేలా భారత్ చర్యలు తీసుకుంటోంది. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్‌పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది. తాము పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తుల డేటాను కోరామని, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ దిశగా పనిచేస్తోందని, త్వరలో ఆ వివరాలు పంపనుందని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాకిస్థాన్ 38వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రమని, భారత్ నుంచి యూఏఈకి ఎగుమతి అయ్యే ఔషధాలను తిరిగి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటుందని, భారత్ ఈ వాణిజ్య సంబంధాలను తెంచుకోవడం ద్వారా పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడనుందని మరో అధికారి అంచనా వేశారు.
కాగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి. మరో వైపు పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం.
అయితే భారత్-పాకిస్థాన్ మధ్య డెరెక్ట్ వాణిజ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. యూఏఈ, శ్రీలంక, సింగపూర్ తదితర దేశాల నుంచి భారత్ వస్తువులు పాకిస్థాన్‌కు చేరుతుంటాయి. వాటిలో బంగారం, విలువైన రంగురాళ్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ ఉత్పత్తులు ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం ఈ థర్డ్ కంట్రీస్ ద్వారా పది బిలియన్ డాలర్లకుపైగా విలువైన భారత వస్తువులు దాయాదికి ఎగుమతి అవుతున్నాయి.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్