
దండ కారణ్యంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కర్రెగుట్టలకు మావోయిస్టు అగ్ర నేతలు తరలివెళ్లినట్టు నిఘావర్గాల సమాచారంతో గత వారం రోజులుగా భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టలను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఆదివారం భారీ సొరంగాన్ని గుర్తించాయి. వెయ్యి మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది.
లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని చెబుతున్నారు.
మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని ప్రభుత్వం, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లా, వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
రుద్రారం పొడవునా ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటివరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా విస్తృత ప్రచారం సాగినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు.
ఇదిలాఉంటే, తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులపై డిజిపి జితేందర్ ఆదివారం సరిహద్దు జిల్లాల ఎస్‌పిలు, నిఘా విభాగం అధికారులతో సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర హోం శాఖతో టచ్‌లో ఉండాలని సూచించారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, విఐపిల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐపిఎస్‌లకు సూచించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత