కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?

కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
 
* కేంద్రం- మావోయిస్టులతో చర్చలకై ముగ్గురు ప్రొఫెసర్లు
 
మావోయిస్ట్ గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా టార్గెట్‌గా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. కర్రెగుట్టల్లో బంకర్‌లో సాయుధదళంతో హిడ్మా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. హిడ్మా వేటలో నాలుగు హెలికాప్టర్లు, 20 మానవరహిత వైమానిక వాహనాలు, యూఏవీలు, రెండు డ్రోన్ స్వాడ్రన్‌లు, ఎన్‌టీఆర్‌వో శాటిలైట్ చిత్రాలు, మ్యాప్స్‌తో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.  రాయపూర్ జగధల్‌పూర్ నుంచి ఈ ఆపరేషన్‌ను సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ పర్యవేక్షిస్తుండగా  వార్‌జోన్‌లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మానిటర్ చేస్తున్నారు. 
అధునాతనమైన డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించారు భద్రతాబలగాలు. మావోయిస్టుల కదలికలపై ఫిబ్రవరిలో తీసిన డ్రోన్ విజువల్స్‌ను బయటకు వచ్చాయి. 
పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఎక్కుతున్న డ్రోన్ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. దీంతో మావోయిస్టులు పెద్దఎత్తున కర్రెగట్టల్లో తలదాచుకున్నట్లు ఈ డ్రోన్‌ దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది. భారీ ఎత్తున బంకర్లను ఏర్పాటు చేసుకుని అందులోనే మావోయిస్టు రాష్ట్ర ఇన్‌చార్జ్ దామోదర్, హిడ్మా సహా తెలంగాణ క్యాడర్ అంతా కూడా కర్రెగుట్టల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
 
కర్రెగుటల్లో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు మూడువేల మంది వరకు గుట్టపైనున్న మావోయిస్టుల కోసం రక్షణ కవచంగా గుట్ట మధ్యభాగంలో అడ్డుగా నిలిచారు. అయితే కర్రెగుట్టలు ఆపరేషన్‌ను నిలిపివేయాలని గత పదిరోజులుగా పౌరహక్కు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అంతే కాకుండా మావోయిస్టు పార్టీ నుంచి కూడా మూడు సార్లు లేఖలు విడుదలయ్యాయి. శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖలు విడుదల చేశారు. దీంతో శాంతి చర్చలు కేంద్రం ముందుకు రావాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్లను పట్టించుకోకుండా భద్రతా బలగాలు ముందుకు దూసుకెళ్తున్నాయి.
మావోయిస్టులను తుదముట్టించేందుకు పూర్తిస్థాయిలో భద్రతా బలగాలు కర్రెగట్టల్లో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పక్కా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దాంతో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వారి ప్రభావం నాలుగు జిల్లాలకే పరిమితమైన్నట్లు హోంమంత్రి అమిత్ షా గత వారం చెప్పారు. 
 
అలాంటి వేళ ఆపరేషన్ కగార్ నిలిపి వేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి భారత్ బచావో శనివారం బహిరంగ లేఖ రాసింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య జరిగే శాంతి చర్చలకు భారత్ బచావో సంధానకర్తగా వ్యవహరిస్తుందని ఆ లేఖలో ఆ సంస్థ స్పష్టం చేసింది.  కేంద్ర ప్రభుత్వంతో మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు కోసం ముగ్గురు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్, ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి పేర్లను ప్రతిపాదించింది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్. 2004లో ఏపీ ప్రభుత్వానికి, మవోయిస్టులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోరంజన్ మోహంతి పేరును ప్రతిపాదించారు. మావోయిస్టులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చకు చొరవ తీసుకోవాలని భారత్ బచావో వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎఫ్ గోపినాథ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
2026, మార్చి మాసాాంతానికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందులోభాగంగా మావోయిస్టులు లోంగిపోయి దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలంటూ కేంద్రం ఇప్పటికే వారికి పిలుపు నిచ్చింది.  మావోయిస్టులు లొంగిపోతే వారిని అన్ని విధాల ఆదుకొంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్రతోపాటు జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం బాగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో వరుసగా పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దాంతో మవోయిస్టులకు భారీగా దెబ్బ తగిలింది.  ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చకు సిద్ధమని మావోయిస్టులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ దీనిపై కేంద్రం వైపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకుండా ఉంది. అలాగే మావోయిస్టుల కేంద్ర కమిటీ కూడా పలుమార్లు లేఖలు విడుదల చేసి వినతి చేసింది. 
చర్చలకు తాము సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కిందిస్థాయి దళాల వరకు వినతి చేసినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కానీ స్పందించని పరిస్థితి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు బాటలు వేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.