
హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2025’లో తప్పుగా ఉన్న భారత పటం వివాదానికి దారితీసింది. జమ్మూ కాశ్మీర్‌ను సరిగా చూపించలేదని బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోతో ఇది వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందని బీజేపీ విమర్శిస్తోంది. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడుతోంది.
ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ లో పహాల్గమ్ లో జరిగిన మారణహోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చిక్కుకుంది. ‘గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన లక్ష్యం’ అనే ఇతివృత్తంతో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 26 వరకు “భారత్ సమ్మిట్ 2025” నిర్వహిస్తుండగా, సుమారు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‍లో ఏర్పాటు చేసిన భారతదేశ చిత్ర పటం తప్పుగా ఉండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
భారత సమ్మిట్‌లో పాల్గొన్న ఫొటోలను మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా ఈ వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ఫొటోల్లో దూరంగా ఓ ఇండియా చిత్రం కనిపిస్తుండగా, అందులో జమ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా ముద్రించనట్టుగా కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బీజేపీ నేతలే కాకుండా చాలా మంది నెటిజన ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో కాసేపటికే ఆ పోస్ట్‌ని రాజగోపాల్ రెడ్డి డిలీట్ చేశారు.
అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలను స్క్రీన్ షాట్ తీసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రచ్చ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి, ప్రజావ్యతిరేక స్వభావాన్ని బహిర్గతం చేసే ఓ క్లాసిక్ ఉదాహరణ అని బీజేపీ నేతలు ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఖాతాలో స్క్రీన్ షాట్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు పోస్టు చేశారు.
తెలంగాణ ప్రజల పన్నుల నుంచి వచ్చిన ప్రభుత్వ నిధులను వినియోగిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఆహ్వానితులుగా సమ్మిట్‌ను నిర్వహించారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది దేశ ద్రోహం అని బీజేపీ తెలంగాణ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యాప్‌లో లద్దాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని బీజేపీ తెలంగాణ మండిపడింది. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన, నీచమైన సందేశాన్ని పంపుతోందని నిప్పులు చెరిగింది. అంటే ఇవి ఇకపై భారత్‌లో భాగం కావని వారి ఉద్దేశమంటూ విమర్శించింది.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో భారత దేశ పటాన్ని కశ్మీర్, లేహ్ లేకుండా ముద్రించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కావాలనే దేశానికి వెన్నుపోటు పొడుస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు.
More Stories
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?
శబరిమలలో బంగారం అదృశ్యంతో ఇరకాటంలో సిపిఎం!