కృష్ణా జలాల పునఃపంపిణీపై  ఏపీ అభ్యంతరం

కృష్ణా జలాల పునఃపంపిణీపై  ఏపీ అభ్యంతరం
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకానికి బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన నూతన అదనపు మార్గదర్శకాలు (టెర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌-టీవోఆర్‌) సరికాదని ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ చేపడితే తనకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. 
సదరు టీవోఆర్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
నదీ పరివాహక ప్రాంతం, ప్రస్తుత నీటివాడకం లెక్కల ఆధారంగానే గతంలో నీటి కేటాయింపులు చేశారని, ఇప్పుడు పునఃపంపకాల కోసం ట్రైబ్యునల్‌కు విధివిధానాలు ఖరారు చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలిపింది.  ఈ మేరకు ఏపీ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఆంధ్ర తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు.
కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జలవివాద చట్టం ప్రకారం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని తెలిపారు.  విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, ఇప్పటికే సెక్షన్‌ 89ఏ, బీ కింద ట్రైబ్యునల్‌ తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై పరిశీలిస్తుండగా కొత్త నియమ నిబంధనలు చేర్చడం తగదని పేర్కొన్నారు. 
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాల పంపిణీలో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 811 టీఎంసీలు కేటాయించారని గుర్తుచేశారు.  విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని వెల్లడించారు. ఇప్పుడు వీటిని మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాల ఖరారు తగదని, దీనివల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, దీనిని సవరించే అధికారం, హక్కు కేంద్రానికి లేవని స్పష్టం చేశారు. 
 
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలకు బచావత్‌ ట్రైబ్యునల్‌ 2013లోనే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరుపుతూ తీర్పు ఇచ్చినా న్యాయపరమైన వివాదాల కారణంగా అమల్లోకి రాలేదని, ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల నడుమ నీటి పంపకాలపై రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 89కు భిన్నంగా కేంద్రం ఏకపక్షంగా కొత్త టీవోఆర్‌ విడుదల చేసిందని తెలిపారు.  కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనలు గురువారం వింటామని, సమయం సరిపోదనుకుంటే ఇంకో రోజు కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. గురువారం సమగ్ర సమాచారం ఇస్తామని గుప్తా తెలిపారు.