క్యాథలిక్‌ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

క్యాథలిక్‌ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత
* పోప్‌ మృతికి ప్రధాని మోదీ సంతాపం
 

క్యాథ‌లిక్ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏండ్లు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ సోమవారం వాటికన్‌ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్‌ సిటీ అధికారికంగా ప్రకటించింది. పోప్‌ నిన్న ఈస్టర్‌ వేడుకల్లో పాల్గొన్నారు.  పోప్‌ ఫ్రాన్సిస్‌ గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రమైన శ్వాస‌కోస‌ స‌మ‌స్యతో ఆయన రోమ్‌లోని ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలలు అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ తుది శ్వాస విడిచినట్లు వాటికన్‌ అధికారులు ప్రకటించారు.  పోప్‌ ఫ్రాన్సిస్‌ 1936 డిసెంబర్‌ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామాతో 2013 మార్చి 13న కేథలిక్‌ చర్చికి 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్​గా నియమితులైన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. 

పోప్​ ఫ్రాన్సిస్​ పేదల పట్ల ఎంతో దయతో ఉండేవారు. ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించేవారు, వాతావరణ మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవారు.  దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఫ్రాన్సిస్​ యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లోని ఓ భాగాన్ని తొలగించారు. 

2025 ఫిబ్రవరిలో ఆయన శ్వాసకోశ సమస్యలతో జెమెల్లి ఆసుపత్రిలో చేరారు. అది డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయన 38 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండి, తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తన అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం, పోప్ ఫ్రాన్సిస్​- సెయింట్‌ మేరీ మేజర్‌ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. 

ఆదివారం ఆయన ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు సందేశం కూడా ఇచ్చారు. కాగా ఈస్టర్ సందర్భంగా చాలా రోజు తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రి చికిత్స తర్వాత పోప్ మార్చి 24న తన నివాసం కాసా శాంటా మార్టాకు తిరిగి వచ్చారు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత తనను చూడాటానికి వచ్చిన ప్రజలకు కూడా ఆయన ఆశీర్వాదం అందించారు.

తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థులకు పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావించేవారు. తదుపరి పోప్‌ను రహస్య ఓటింగ్‌ ద్వారా కార్డినల్స్‌ కాలేజ్‌ ఎన్నుకోనుంది.

వాస్తవానికి పోప్ ఈ ఏడాది భారత్​లో పర్యటించాల్సి ఉంది. కాథలిక్ చర్చి జూబ్లీ ఇయర్ వేడుకల కోసం ఆయన భారత్​కు రావాల్సి ఉంది. గతేడాది డిసెంబర్‌లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆయన్ను ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినిధి బృందం స్వయంగా ఆయన్ను కలిసింది. అయితే పోప్​ అనారోగ్యం కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన కన్నుమూశారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోప్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోప్‌ మరణ వార్త తీవ్ర బాధను కలిగించిందని,  భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

“పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్ర బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో ప్రపంచ క్యాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. పోప్‌ చిన్నప్పటి నుంచీ ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాలకు ఎంతో శ్రద్ధగా సేవ చేశారు. ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను ఎప్పటిగా ప్రేమతో గుర్తుంచుకుంటాను. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందాను. భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది” అని ప్రధాని తన ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

ఈ పోస్ట్‌కు గతంలో వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిన్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫొటోలను పంచుకున్నారు. అక్టోబర్‌ 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ-20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన సమయంలో వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిన్‌ను కలిశారు. దాదాపు 30 నిమిషాల‌పాటు పోప్ ఫ్రాన్సిస్‌, ప్రధాని మోదీ వివిధ విష‌యాల‌పై మాట్లాడుకున్నారు. అనంత‌రం భార‌త్‌కు రావాల్సిందిగా పోప్‌ను ప్రధాని ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రత్యేకమైన బహుమతిని కూడా అందజేశారు. పూర్తిగా సిల్వర్‌తో త‌యారు చేసిన క్యాండిల్ స్టాండ్‌, ఓ పుస్తకాన్ని పోప్‌కు ప్రధాని బహుమతిగా ఇచ్చారు. ఫ్రాన్సిస్ కూడా మోదీకి ఓ బహుమతి ఇచ్చారు. బ్రాంజ్‌తో త‌యారు చేసిన ఓ స‌ర్క్యుల‌ర్ మెమోంటోను అంద‌జేశారు. బైబిల్ సూక్తుల‌తో ఉన్న ఆ బహుమతిని మోదీ అందుకున్నారు.