హిందువులకు ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక

హిందువులకు ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక

దేశంలో కుల బేధాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్‌ హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. “ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక” అనే సూత్రానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. దీన్ని పాటిస్తూ సామాజిక సామరస్యానికి కృష్టి చేయాలని ఆయన కోరారు.

అలీగఢ్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్న డా. మోహన్‌ భగవత్ హెచ్ బి ఇంటర్ కాలేజీ, పంచన్ నగరి పార్క్ లలో జరిగిన రెండు ఆర్ఎస్ఎస్ శాఖలలో స్వయంసేవక్ లను ఉద్దేశించి ప్రసంగిస్తూ హిందూ విలువల ప్రాముఖ్యతను చెప్పారు.  భారత్ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలంటే నిజమైన సామాజిక ఐక్యతను సాధించడం అత్యవసరం అని స్పష్టం చేశారు. 

హిందువులంతా కలిసికట్టుగా ఉండాలి. మతపరమైన సామరస్యాన్ని పెంపొందింపచేయాలని ఆయన కోరారు.  అంతా కలిసి ఒకే గుడికి వెళ్లాలి. ఒకే జలాశయానికి వెళ్లి మంచినీరు తీసుకోవాలని, అప్పుడే వారి మధ్య ఉండాల్సిన సోదర బంధం ఇనుమడిస్తుందని తెలిపారు. ఐక్యతకు ప్రతీక దేవుడు, జలం, మరణానంతర అంత్యక్రియలు ఇవన్నీ కూడా సామూహికంగా జరగాల్సి ఉందని చెప్పారు. 

“ఈ ప్రపంచంలో శాంతి సాధించడానికంటే ముందు, భారత్‌ సామాజిక ఐక్యత సాధించడం అవసరం. హిందూ సమాజానికి పునాదిగా భావించే సంస్కారం (విలువలు), సాంస్కృతిక విలువలు, సంప్రదాయం, నైతిక సూత్రాల పేరుతో ఆ చీకటి లోయల లోతుల్లో పాతుకుపోయిన ఈ సమాజ ఆలోచన తీరును నిర్మూలించాలి. కుల విభేదాలకు పూర్తిగా స్వస్తి పలకాలి” అని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

హిందూ సమాజానికి విలువలు, సంస్కారం కీలకం అని పేర్కొంటూ సాంప్రదాయం, సాంస్కృతిక విలువుల , నైతిక సూత్రాల మూలాలు ఉన్న సామాజిక వ్యవస్థ నిర్మాణంలో అంతా పాలుపంచుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమైక్యత , సామరస్య మూల సిద్ధాంతాలను ఇంటిలోనూ బయట ఎప్పటికప్పుడు తమ సందేశం వెలువరిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలని కోరారు. 

మన సమాజంలో కుటుంబమే ప్రాధమిక యూనిట్ గా ఉంటుందని చెబుతూ  బలమైన కుటుంబ విలువలపై నిర్మించబడిన సమాజం  “సంస్కారం” నుండి ఉద్భవిస్తోందని తెలిపారు.  సమాజానికి నిర్మాణాత్మక శక్తిగా స్వయం సేవక్‌ల బృందం ఉంటుందని తెలిపారు. పండుగలు వస్తే సామూహికత ఉట్టిపడాల్సి ఉంటుంది. జాతీయవాదం, సామాజిక సహజీవన లక్షణాలు అణువణువునా ద్యోతకం కావల్సి ఉందని చెప్పారు.

“నైతిక విలువలను పాటిస్తూ మన సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అన్ని వర్గాల వారిని ఇళ్లలోకి ఆహ్వానించాలి. ఈ విషయంలో ఎలాంటి భేదాలు చూపకూడదు. అట్టడుగు స్థాయి నుంచి సామరస్యాన్ని, ఐక్యతను వ్యాప్తి చేయాలి. సంస్కారం అనే పునాదిపై మన కుటుంబ వ్యవస్థ, దాని విలువలు రూపుదిద్దుకున్నాయి” అని చెప్పారు. 

“ఇది సమాజంలో ప్రాథమిక యూనిట్‌గా ఉంటోంది. జాతీయవాదం, సామాజిక ఐక్యత పునాదులను మరింత బలోపేతం చేసేందుకు అన్ని పండుగలను సామూహికంగా నిర్వహించడం ఎంతో కీలకం” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.