అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన రూ.500 విలువ గల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించారు.
ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వాటిని గుర్తించడం సులభం కాదని, చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని, దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. ”RESERVE BANK OF INDIA” అనే దానిలో ”RESERVE” పదంలో ‘E’ బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటును నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది.
ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు. మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ప్రజలు వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

More Stories
పిఎం ఇ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రాలకు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులు
రికార్డు స్థాయిలో ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.2.4లక్షల కోట్లు
ముంబయిలో రూ.1,745 కోట్ల కొకైన్ పట్టివేత