
కంచ గచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసాన్ని అడ్డుకున్న హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల కొట్టివేత హామీ కొలిక్కిరాలేదు. అన్ని కేసులను తక్షణమే కొట్టేస్తామని, విద్యార్థులకు కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించి రెండువారాలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు.
దీంతో భట్టి చెప్పినవన్నీ వట్టి మాటలేనని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇచ్చినమాటకు కట్టుబడి అక్రమ కేసులను కొట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపాలని మార్చి 30న విద్యార్థులు శాంతియుతంగా నిరసనకు దిగారు. వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు అక్కడి నుంచి కదలలేదు.
దీంతో పోలీసులు విద్యార్థులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆడపిల్లల దుస్తులు చిరుగుతున్నా పట్టించుకోకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈక్రమంలో హెచ్‌సీయూ పీహెచ్డీ స్కాలర్స్ ఎర్రం నవీన్, రోహిత్ పోలీసుల చర్యలకు ప్రతిఘటించినందుకు వారిపై పలు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. తమపై దాడి చేశారని, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్‌రెడ్డి గాయపడ్డారని ఆరోపించారు.
భారతీయ న్యాయ సంహితలోని 118(1), 132, 191(3), 329(3), 351(3) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. 15 రోజుల తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతున్నారు. అదేరోజు మరో 54 మంది విద్యార్థులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి బీఎన్ఎస్ఎస్ 170 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని విద్యార్థులు కోరుతున్నారు. హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని వారు వాపోతున్నారు. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినా వారిపై ఇంకా విచారణ కొనసాగుతున్నది. 25న మరోసారి విచారణ కోసం కోర్టుకు రావాలని చెప్పారు. కేసులు ఎప్పుడెప్పుడు కొట్టివేస్తారా అని విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తొందరలోనే స్పందించి తమపై పెట్టిన కేసులన్నింటినీ కొట్టేస్తుందని ఆశిస్తున్నాను.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత