ముర్షీదాబాద్ అల్లర్లపై బంగ్లా వ్యాఖ్యల పట్ల భారత్ ఆగ్రహం

ముర్షీదాబాద్  అల్లర్లపై బంగ్లా వ్యాఖ్యల పట్ల భారత్ ఆగ్రహం
* టిఎంసి ఎంపీ కనిపించక పోవడంపై ఆగ్రహం
ప‌శ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఇటీవ‌ల జరిగిన అల్ల‌ర్లకు స్పందిస్తూ అక్క‌డ మైనార్టీ ముస్లిం జ‌నాభాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ ఇటీవ‌ల బంగ్లాదేశ్ వ్యాఖ్య‌లు చేయడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ తిప్పికొట్టింది. మీ దేశంలో ఉన్న మైనార్టీల‌పై మీరు ఫోక‌స్ పెట్టాల‌ని భార‌త్ కౌంట‌ర్ ఇచ్చింది.  బెంగాల్ ఘ‌ట‌న‌పై బంగ్లా స్పందించ‌డాన్ని విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ్‌దీర్ జైస్వాల్ ఖ‌డించారు.
బంగ్లాదేశ్‌లో మైనార్టీల ఊచ‌కోత జ‌రుగుతోంద‌ని, దాన్ని బెంగాల్ ఘ‌ట‌న‌తో పోల్చ‌డం స‌రికాద‌ని హితవు చెప్పారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం కన్నా  స్వంత మైనార్టీల‌పై బంగ్లా ఫోక‌స్ పెట్ట‌డం మంచిదని ర‌ణ్‌దీర్ పేర్కొన్నారు. వ‌క్ఫ్ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ ఇటీవ‌ల బెంగాల్‌లో నిర‌స‌న‌లు జ‌రిగాయి. ముర్షీదాబాద్‌, మాల్దా, సౌత్ 24 పార్‌గ‌నాస్‌, హూగ్లీలో అల్ల‌ర్లు జ‌రిగాయి. దోపిడీలు, రాళ్లు రువ్వుకోవ‌డంతో పాటు రోడ్ల‌ను బ్లాక్ చేశారు.
ఆ హింస‌ను ఖండిస్తూ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజ‌ర్ ప్రెస్ సెక్ర‌ట‌రీ షాఫికుల్ ఆల‌మ్ వ్యాఖ్య‌లు చేశారు.  బెంగాల్ హింస‌లో బంగ్లా పాత్ర ఉన్న‌ట్లు భార‌త్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని, బెంగాల్ రాష్ట్రాన్ని కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఆల‌మ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను భార‌త్ తిర‌స్క‌రించింది.

“పశ్చిమ బెంగాల్​లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాం. బంగ్లాదేశ్​లోని మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు బంగ్లాదేశ్​ ఆడుతున్న కపట నాటకం ఇది. నిజంగా మైనారిటీలపై దాడులు చేస్తున్న నేరస్థులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కనుక అనవసర వ్యాఖ్యలు చేయడం, ధర్మోపదేశాలు ఇవ్వడం కంటే, మీ బంగ్లాదేశ్​లోని మైనారిటీలను రక్షించడంపై దృష్టి పెట్టడం మంచిది” అంటూ రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు.

ఇలా ఉండగా, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్‌ లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో కూల్‌గా ఛాయ్ తాగుతూ పోస్టింగ్‌లు పెట్టిన టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ ఇటీవల అందరి ఆగ్రహాన్ని చవిచూశారు. ఘర్షణల ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించి ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ బహ్రాంపూర్ ఎంపీ ఒక్కమాట మాట్లాడకపోవడం, అసలు ఆయన ఆచూకీ కూడా లేకపోవడంతో విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ టీఎంసీ నేతల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ నియోజకవర్గంపై నేరుగా ఎలాంటి ప్రభావం లేనప్పటికీ అల్లర్లు చెలరేగిన ప్రాంతాలకు ఆయన నియోజకవర్గం ఎంతో దూరంలో లేదు. 
ఈ నేపథ్యంలో పఠాన్ కనిపించకపోవడంతో విపక్షాలతో పాటు టీఎంసీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. హింసాత్మక ఘటనల క్రమంలో యూసఫ్ పఠాన్ ముఖం చాటువేయడంపై ముర్షీదాబాద్ ఎంపీ అబు తహెర్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు.