నక్సలైట్లు 4 జిల్లాలకే పరిమితం, వచ్చే మార్చికి అంతం!

నక్సలైట్లు 4 జిల్లాలకే పరిమితం, వచ్చే మార్చికి అంతం!

* 22 మంది న‌క్స‌ల్స్ అరెస్టు, పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం

న‌క్స‌లైట్లు కేవ‌లం నాలుగు జిల్లాల‌కే ప‌రిమిత‌మై ఉన్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చి 31వ తేదీ వ‌ర‌కు న‌క్స‌ల్స్ అంతం అవుతార‌ని ఆయ‌న స్పష్టం చేశారు. న‌క్స‌ల్స్‌ను రూపుమాప‌డంలో సీఆర్పీఎఫ్ వెన్నుముఖ‌గా నిలిచిన‌ట్లు ఆయ‌న కొనియాడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్ జిల్లాలో గురువారం సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన 86వ రైజింగ్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

దేశం నుంచి న‌క్స‌లైట్లను ఏరివేయ‌డంలో సీఏపీఎఫ్‌ (సెంట్ర‌ల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్‌) తోపాటు సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు అమిత్ షా తెలిపారు. క‌మాండో బెటాలియ‌న్ ఫ‌ర్ రిజ‌ల్యూట్ యాక్ష‌న్‌ (కోబ్రా) యూనిట్‌ భ‌ద్ర‌తా ద‌ళాల్లో ప్ర‌త్యేకంగా ప‌నిచేస్తున్న‌ది. 

గెరిల్లా, జంగిల్ యుద్ధాల్లో ఆ దళం ఆరితేరి ఉన్న‌ది. న‌క్స‌ల్స్‌ను ఎదుర్కోవ‌డంలో కోబ్రా ద‌ళం ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ద‌న్నారు. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్వ‌ర్డ్ ఆప‌రేటింగ్ బేస్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు షా వెల్ల‌డించారు. దీని వ‌ల్లే ఈ ప్రాంతాల్లో హింస త‌గ్గింద‌ని పేర్కొన్నారు.  సుమారు 70 శాతం హింస త‌గ్గిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

దేశ భ‌ద్ర‌త కోసం సీఆర్పీఎఫ్ చేసిన సేవ‌లు అసాధార‌ణ‌మైన‌వ‌ని పేర్కొన్నారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడ‌టంలోనైనా, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెల‌కొల్పాల‌న్నా, న‌క్స‌లైట్ల‌ను ఎదుర్కోవాల‌న్నా సీఆర్పీఎఫ్ చేస్తున్న పోరాటం అసామాన్య‌మైంద‌ని హోంమంత్రి తెలిపారు. ప్ర‌తి అచీవ్‌మెంట్‌లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల పాత్ర కీల‌కంగా ఉన్న‌ట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ సాధించిన అతి గొప్ప విజ‌యాల న‌క్స‌లిజాన్ని పార‌ద్రోల‌డ‌మే అని తెలిపారు.

కోబ్రా క‌మాండోల గురించి విన్న‌ప్పుడు న‌క్స‌ల్స్ వ‌ణికిపోతున్నార‌ని చెప్పారు. ధైర్యానికి ప్ర‌తీక‌గా కోబ్రా బెటాలియ‌న్ నిలిచింద‌ని పేర్కొంటూ 86వ రైజింగ్ డే సంద‌ర్భంగా కోబ్రా యూనిట్ జ‌వాన్ల‌కు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు షా వెల్ల‌డించారు.  వారి నేతృత్వంలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు న‌క్స‌లిజం రూపుమాప‌డంలో ముందుకెళ్లిన‌ట్లు చెప్పారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశం నుంచి న‌క్స‌లిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంద‌ని షా తెలిపారు. దేశం ఈ ప్ర‌తిజ్ఞ తీసుకున్న‌ద‌ని, ఇక సీఆర్పీఎప్ వెన్నుముఖ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.

వాస్త‌వానికి ప్ర‌తి ఏడాది మార్చి 19వ తేదీన సీఆర్పీఎఫ్ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. 1950వ సంవ‌త్స‌రంలో ఈ రోజునే కేంద్ర హోంమంత్రి వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జెండాను ద‌ళానికి అంద‌జేశారు. అయితే ఈ ఏడాది సంబ‌రాల‌ను పొడిగించిన నేప‌థ్యంలో ఏప్రిల్ 17వ తేదీన ప‌రేడ్ నిర్వ‌హించారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి మోహ‌న్ యాద‌వ్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్ జిల్లాలో 1939, జూలై 27వ తేదీన బ్రిటీష్ పాల‌కులు క్రౌన్ రిప్ర‌జెంటేటివ్ పోలీసు శాఖ‌ను ఏర్పాటు చేశారు. దాన్నే 1949, డిసెంబ‌ర్ 28వ తేదీన సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్‌గా హోంమంత్రి ప‌టేల్ మార్చేశారు.

ఇలా ఉండగా, చ‌త్తీస్‌ఘ‌డ్‌లో గురువారం 22 మంది న‌క్స‌లైట్ల‌ను అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి పేలుడు ప‌దార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు. ఉసూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న టేక‌మెట్ల గ్రామం అట‌వీ ప్రాంతం నుంచి ఏడు మంది క్యాడ‌ర్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల‌తో పాటు కోబ్రా క‌మాండోలు నిర్వ‌హించిన కూంబింగ్ ఆప‌రేష‌న్‌లో న‌క్స‌ల్స్ చిక్కారు.

జంగ్లా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బెల్చార్ గ్రామం నుంచి ఆరు మంది న‌క్స‌ల్స్‌, నీలస్నార్ పోలీసు స్టేష‌న్ పరిధిలోని కంద‌క‌ర్ల గ్రామం అడ‌వుల నుంచి 9 మంది న‌క్స‌ల్స్‌ను అరెస్టు చేశారు.  రెండు చోట్ల భ‌ద్ర‌తా ద‌ళాలు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి న‌క్స‌లైట్ల‌ను ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుంచి టిఫిన్ బాంబులు, జిలాటిన్ స్టిక్స్‌, డెటోనేట‌ర్లు, ఎల‌క్ట్రిక్ వైర్లు, బ్యాట‌రీలు, మావో క‌ర‌ప‌త్రాలు, ఇత‌ర సామాగ్రిని సీజ్ చేశారు.