పొలిసు శాఖలో అమలు కానీ మహిళల కోటా

పొలిసు శాఖలో అమలు కానీ మహిళల కోటా

* హైకోర్టుల్లో మహిళల సంఖ్య 14 శాతమే

పోలీసు శాఖలో మహిళల కోటా అమలు కావడం లేదు. అత్యధికులు కానిస్టేబుల్‌ స్థాయిలోనే మగ్గిపోతున్నారు. మంగళవారం విడుదలైన ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ (ఐజెఆర్‌) 2025 నివేదిక ప్రకారం, డైరెక్టర్‌ జనరల్‌ లేదా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వంటి సీనియర్‌ పదవుల్లో ఉన్నది వెయ్యిలోపే. దాదాపు 90 శాతం మంది మహిళలు కానిస్టేబుల్‌ స్థాయిలోనే పనిచేస్తున్నారు. 

పోలీసుల్లోని 2.4 లక్షల మంది మహిళల్లో, 960 మందే ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపిఎస్‌) ర్యాంకుల్లో ఉండగా, 24,322 మంది డిప్యూటీ సూపరింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ లేదా సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ వంటి నాన్‌-ఐపిఎస్‌ ఆఫీసర్‌ పదవులను కలిగి ఉన్నారు. ”పోలీస్‌, న్యాయవ్యవస్థ, జైళ్లు, చట్ట సహాయం సామర్థ్యంపై రాష్ట్రాల ర్యాంకింగ్‌” అనే నివేదిక, చట్ట అమలులో లింగ వైవిధ్యం ఆవశ్యకత గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, పోలీసు దళంలో మహిళా ప్రాతినిధ్యం కోసం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం తన లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొంది.

జనవరి 2023 నాటికి, పోలీసులలో మొత్తం మహిళల ప్రాతినిధ్యం – సివిల్‌ పోలీస్‌, డిస్ట్రిక్ట్‌ ఆర్మ్డ్‌ రిజర్వ్‌ (డిఎఆర్‌), స్పెషల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ బెటాలియన్‌, ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలి యన్‌ (ఐఆర్‌బి) – 12.3 శాతంగా ఉందని, ఇది జనవరి 2022లో 11.7 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో, బీహార్‌ 24 శాతంతో, పోలీసులలో మహిళా ప్రాతినిధ్యంలో ముందుంది. 2022లో 21 శాతం నుండి 2024లో 24 శాతానికి బీహార్‌లో వారి ప్రాతినిధ్యం పెరిగింది.

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌తో సహా తొమ్మిది ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌ 133 మంది మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌లను కలిగి ఉండి, జాబితాలో అగ్రస్థానంలో ఉంది. చట్ట అమలులో లింగ వైవిధ్యం అవసరం గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, పోలీసు శాఖలో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం తన లక్ష్యాన్ని చేరుకోలేదని నివేదిక పేర్కొంది.

33 శాతం మహిళల కోటా అమలుకు ఇప్పటి పరిస్థితులు కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు దాదాపు మూడు సంవత్సరాలు పడుతుందని, జార్ఖండ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులకు దాదాపు 200 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.

ఇలా ఉండగా, దిగువ న్యాయవ్యవస్థలో 38 శాతం మంది మహిళలు ఉండగా, హైకోర్టులలో ఈ సంఖ్య 14 శాతానికి పడిపోయిందని కూడా నివేదిక కనుగొంది. ఫిబ్రవరి- మార్చి 2025 వరకు ఉన్న డేటా ఆధారంగా, న్యాయమూర్తుల విషయానికొస్తే, అన్ని రాష్ట్రాలలో సబార్డినేట్‌ న్యాయవ్యవస్థలో మహిళల వాటా క్రమంగా పెరిగినప్పటికీ, హైకోర్టులలో ఇలాంటి పెరుగుదల కనిపించలేదని పేర్కొంది.

జిల్లా న్యాయవ్యవస్థలో కూడా అదే కాలంలో మహిళల వాటా 38 శాతానికి పెరిగింది. అయితే, జిల్లా న్యాయవ్యవస్థలో షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టి), షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్‌సి) వాటా వరుసగా 5 శాతం, 14 శాతం వద్ద తక్కువగా ఉంది. అదనంగా, షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టి), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)లతో పోలిస్తే షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్‌సి) కోసం ఉద్యోగ కోటా లక్ష్యాలను తక్కువ రాష్ట్రాలు చేరుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. 

అధికారుల స్థాయిలో, 5 రాష్ట్రాలు మాత్రమే ఎస్‌సి కోటాను చేరుకున్నాయి, 7 రాష్ట్రాలు ఎస్‌టి కోటాను చేరుకున్నాయి. 9 రాష్ట్రాలు ఒబిసి కోటాను చేరుకున్నాయి.పోలీసు శాఖలో ఎస్‌సిలు 17 శాతం, ఎస్‌టిలు 12 శాతం ఉన్నారు, ఇది దామాషా ప్రాతినిధ్యంలో లేదు.