కంచ గచ్చిబౌలిలో అడవులు లేవంటే అక్కడే జైలు!

కంచ గచ్చిబౌలిలో అడవులు లేవంటే అక్కడే జైలు!
 
* సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు చుక్కెదురు
 
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర అధికారులను కాపాడాలని అనుకుంటే వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలని స్పష్టం చేశారు.
దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్‌ కోను విధించారు. కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే అదే ప్రాంతంలో జైలు కట్టి అందులోనే అధికారులను పెట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు. 
అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కంచ గచ్చిబౌలి భూముల అంశంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ తరఫున లాయర్‌ స్పందిస్తూ జామాయిల్‌ తరహా చెట్లు, పొదలను అనుమతి తీసుకునే తొలగించామని తెలిపారు. 
 
అందుకు చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని కోరారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.  మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని,  ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్‌ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్‌ చేశారా? అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రమే ముఖ్యమని ఆయన చెప్పారు.
భూముల మార్టిగేజ్‌తో తమకు సంబంధం లేదని, చెట్ల నరికివేత గురించే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. సీఎస్‌ను కాపాడాలనుకుంటే వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో, పునరుద్ధరణ ఎలా, ఎంతకాలంలో చేస్తారో చెప్పాలని నిలదీశారు. జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు