
ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది.
శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.
గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని పేర్కొంది. మంత్రిమండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించింది.
415 పేజీలతో కూడిన నాలుగు రోజుల క్రితం ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం రాత్రి 10.54 గంటలకు సుప్రీంకోర్టు వెస్‌సైట్‌లో ఉంచారు. కాగా, గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది.
కాగా, గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే మొదటిసారి.
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించక పోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం