కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర!

కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర!
హనుమాన్ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు ఆంజనేయస్వామి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హనుమాన్ జయంతి శోభాయాత్రలు ప్రారంభం అయ్యాయి. 

నేడు భారతదేశమే కాదు.. ప్రపంచమంతా హిందూ జీవన విధానానికి అలవాటు పడుతున్నారని, ప్రపంచ దేశాల్లో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతోందని ప్రముఖ స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ రామ్ విలాస్ దాస్ వేదాంతి తెలిపారు. ప్రపంచానికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు అనే విషయాన్ని రామభక్తుడు ఆంజనేయస్వామి నిరూపించాడని పేర్కొన్నారు. 

భాగ్యనగరంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ హనుమాన్ మందిర్ దగ్గర శోభాయాత్రను ప్రారంభించిన ఆయన కోటి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా దగ్గర బహిరంగ సభలో మాట్లాడారు. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే భాగ్యనగరంలో భక్తి ఎక్కువగా ఉందని చెబుతూ హిందూ సంఘటనలో భాగ్యనగరం భారతదేశానికి దిక్సూచిగా మారుతుందని చెప్పారు.

 హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాల్లో ఏటా సాంప్రదాయ సిద్దంగా జరిగే ప్రధాన శోభాయాత్ర ప్రశాంతంగా  ఉదయం 11:30కు శోభాయాత్ర ప్రారంభమైంది.  నగరంలో గౌలిగూడ శ్రీ రామమందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిరం వరకు 12 కిలోమీటర్ల పైగా దూరం ఈ హనుమాన్ శోభాయాత్ర సాగుతుంది.  ప్రధాన యాత్రలో పలు ప్రాంతాల నుంచి చిన్న యాత్రలు కూడా కలుస్తాయి. రాత్రి దాదాపు 8 గంటల వరకు సాగే ఈ శోభాయాత్ర పుత్లిబౌలి, కోఠి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, కవాడిగూడ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది.

‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలు, యువత ఉత్సాహంతో శనివారం నిర్వహించే హనుమాన్‌ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లను కూడా ఏర్పాటు చేశారు.  కాగా శోభాయాత్ర సందర్భంగా పలు ప్రాంతాలలో వాహనాల రాకపోకలపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు కాలి నడకన కిలోమీటర్ల దూరం నుండి అంజన్నను దర్శనం చేసుకోవటానికి వస్తున్నారు.నిన్నటి నుండి మూడు రోజుల పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు.