జూన్ 6 నుండి భక్తులకు అయోధ్య ఆల‌యంలో రామ్ ద‌ర్బార్

జూన్ 6 నుండి భక్తులకు అయోధ్య ఆల‌యంలో రామ్ ద‌ర్బార్
అయోధ్య‌లో నిర్మించిన రామాల‌యంలో.. రామ్ ద‌ర్బార్‌ భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్న‌ది. జూన్ ఆర‌వ తేదీ నుంచి ఆ ద‌ర్బార్‌లోకి భ‌క్తుల్ని అనుమ‌తించ‌నున్నారు. అయితే రామ్ ద‌ర్బార్ ప్రారంభోత్సవం కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేద‌ని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌తో అయోధ్య రామాల‌య నిర్మాణం పూర్తి అయినట్లు అవుతుందుని తెలిపారు. 
 
2020లో అయోధ్య ఆల‌య నిర్మాణం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 2024లో రామ్‌ల‌ల్లా ప్ర‌తిష్టాప‌న జ‌రిగింది. ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రామ్ ల‌ల్లాకు ప్రాణ ప్ర‌తిష్ట గ‌త ఏడాదే జ‌రిగింద‌ని, అయితే ఇప్పుడు రాజారాంగా రాముడి విగ్ర‌హాన్ని రామ్ ద‌ర్బార్‌లో ప్ర‌తిష్టించ‌నున్న‌ట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. 
 
మొదటి అంతస్తులో నిర్మిస్తున్న ద‌ర్బార్‌లో రాజా రామ్‌ను ప్ర‌తిష్టిస్తారు. మే 23వ తేదీన జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాముడు, సీత, రాముడి సోద‌రుల విగ్ర‌హాల‌ను ఆ రోజున ప్ర‌తిష్టిస్తార‌ని మిశ్రా వెల్ల‌డించారు. ద‌ర్బార్‌లో రాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన స‌మ‌యంలో పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని, కానీ అది ప్రాణ ప్ర‌తిష్ట త‌ర‌హాలో ఉండ‌ద‌ని పేర్కొన్నారు.భ‌క్తులకు రామ్ ద‌ర్బార్‌లోకి ప్ర‌వేశం క‌ల్పించ‌డానికి ముందు పూజ‌లు జ‌రుగుతాయ‌ని మిశ్రా చెప్పారు. ర‌క‌ర‌కాలు పూజ‌లు నిర్వహిస్తామ‌ని, అవి జూన్ 5వ తేదీన పూర్తి అవుతాయ‌ని తెలిపారు. మే 23, జూన్ 5వ తేదీలను మంగ‌ళ‌క‌ర‌మైన రోజుల‌గా భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పూజ ముగిసిన త‌ర్వాత జూన్ 6వ తేదీ నుంచి రామ్ ద‌ర్బార్‌లోకి భ‌క్తుల్ని అనుమ‌తిస్తార‌ని వివరించారు.

జైపూర్ వైట్ మార్బుల్ తో చెక్కిన 5 అడుగుల ఎత్తు అయిన రాముడి విగ్ర‌హాన్ని రామ్ ద‌ర్బార్‌లో ప్ర‌తిష్టించ‌నున్నారు. ఆ రాముడి విగ్ర‌హంతో పాటు సీత‌, ల‌క్ష్మ‌ణ‌, భ‌ర‌త‌, శ‌త్రుఘ్న‌, హ‌నుమాన్ విగ్ర‌హాలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. పూజా కార్య‌క్ర‌మాల‌ను నిరాడంబ‌రంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. జూన్ ఆరో తేదీ వ‌ర‌కు ఆల‌యంలోని రెండవ అంతస్తు కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. 

ప్ర‌ధాన ఆల‌యానికి చెందిన నిర్మాణ ప‌నులు పూర్తి అవుతాయ‌ని, అయితే కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. జూన్ ఆరో తేదీ వ‌ర‌కు రామాల‌యంతో పాటు ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న మ‌రో ఏడు ఆల‌యాలు కూడా పూర్తి అవుతాయ‌ని తెలిపారు. దీంట్లో మ‌హార్షి వాల్మీకి ఆల‌యం కూడా ఉన్న‌ది.