
ఏపి ప్రభుత్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తెలంగాణ అధికారులు ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష పోకడలకు జిఆర్ఎంబి అడ్డుకట్టవేయాలని తెలంగాణ నీటిపారుదల అధికారులు పట్టుబట్టారు. ముందునుంచి ఏపి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల విషయంలో అత్యంత గో ప్యత పాటిస్తుందని తెలంగాణ అధికారులు ఆరోపించారు.
రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిపింది. 180 టిఎంసిల మిగులు జలాలను తరలించాలనే లక్ష్యంతో ఎపి సర్కారు పనిచేస్తోందని గుర్తు చేసింది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం నాగార్జునసాగర్ కుడికాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించింది. బనకచర్ల ప్రాజెక్టను అక్రమ ప్రాజెక్టుగా ప్రకటించాలని, బనకచర్ల ప్రాజెక్టు అంశంపై గోదావరి బోర్డుకు కేంద్రం నుంచి అధికారికంగా లేఖ అందినప్పటికీ ఏపి ప్రభుత్వం గత ఐదు నెలలుగా బేఖాతర్ చేస్తుందని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానిమూలంగా తెలంగాణపై ప్రభావం తదితర వివరాలను ఎపి ప్రభుత్వం అందించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. అక్రమంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతాల నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యవసాయరంగంగణాంకాలతో అధికారులు వివరించారు.
తెలంగాణ అధికారుల అభ్యంతరాలపై ఏపి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిపిఆర్) ఖరారు కాలేదని తెలిపారు. తాము ఎలాంటి పనులూ చేయడం లేదని ఎపి ఇఎన్సి వెంకటేశ్వర్రావు తెలిపారు. అదేవిధంగా బోర్డు సమావేశంలో పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమావేశంలో చర్చించారు. రూ.15 కోట్ల వ్యయంతో రిపేర్లు చేయాలని నిర్ణయించారు.
కాగా, గోదావరి బోర్డు కార్యదర్శి అజగేషన్ విధినిర్వహణలో వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గోదావరి బోర్డులో డిప్యూటేషన్పై పనిచేస్తున్న తెలంగాణ, ఏపి అధికారులను వేధిస్తున్నారని, మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి