తమిళనాడు గవర్నర్​కు సుప్రీం మందలింపు

తమిళనాడు గవర్నర్​కు సుప్రీం మందలింపు
* పెండింగ్ లో ఉంచిన 10 బిల్లులకు సుప్రీం ఆమోదం

తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్‌ ఆర్ఎన్​ రవి సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు ఎటువంటి విచక్షణాధికారాలు లేవని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం సహా అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఆ పిటిషన్‌పై ఇంతకుముందు విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌లో ఉంచకూడదని పేర్కొంటూ మంగళవారం కీలక తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేయకపోతే గరిష్టంగా మూడు నెలల వ్యవధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 

రాష్ట్ర శాస‌న‌స‌భ నుంచి వ‌చ్చిన బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి ఇవ్వాల‌ని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిర‌స్క‌రించాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్  రవి 2020 నుంచి 10 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు, స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ పంపిన ప‌ది బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ రిజ‌ర్వ్‌లో పెట్టుకోవ‌డం అక్ర‌మం అని, న్యాయ వ్య‌తిరేక‌మైంద‌ని, అందుకే ఆ చ‌ర్య‌ల‌ను ప‌క్క‌న పెడుతున్నామ‌ని, ఆ బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించిన నాటి నుంచి వాటికి క్లియ‌రెన్స్ ద‌క్కిన‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది.

పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యంలో గ‌వ‌ర్న‌ర్ల చాలా చురుకుగా ప‌నిచేయాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఓ స్నేహితుడిగా, మార్గ‌ద‌ర్శిగా, త‌త్వ‌వేత్త‌గా గ‌వ‌ర్న‌ర్ ప‌నిచేయాల‌ని కోర్టు సూచించింది. రాజ‌కీయ ప్రేర‌ణ‌తో ఆయ‌న ప‌నిచేయ‌రాదు అని ధ‌ర్మాస‌నం తెలిపింది. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో గ‌వ‌ర్న‌ర్ ఓ దూత‌లా ఉండాల‌ని, ఓ ఉత్ప్రేర‌కంగా ప‌నిచేయాల‌ని కోర్టు చెప్పింది. రాజ్యాంగ విలువ‌ల్ని గ‌వ‌ర్న‌ర్లు ర‌క్షించాల‌ని కోర్టు తెలిపింది.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల విజయంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత, 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.