సోష‌ల్ మీడియా పోస్టులపై బ్రిటన్ లో రోజుకు 33 మంది అరెస్టు

సోష‌ల్ మీడియా పోస్టులపై బ్రిటన్ లో రోజుకు 33 మంది అరెస్టు
సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్టులు పెట్టి అరెస్టు అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న‌ది. బ్రిట‌న్‌లో ప్ర‌తి ఏడాది వేల సంఖ్య‌లో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను టైమ్స్ ప‌త్రిక‌లో రిలీజ్ చేశారు. 
 
ప్ర‌తి ఏడాది సుమారు 12 వేల మందిని అరెస్టు చేస్తున్న‌ట్లు తెలిసింది. క‌మ్యూనికేష‌న్స్ యాక్ట్ 2003లోని సెక్ష‌న్ 127, 1988 క‌మ్యూనికేష‌న్స్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 1 ప్ర‌కారం సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర అభ్యంత‌ర‌క‌మైన మేసేజ్‌లు చేసే వారిపై ఈ చ‌ట్టాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. అస‌భ్య‌, అశ్లీల కాంటెంట్‌ను షేర్ చేసిన వారిపై కూడా కేసు బుక్ చేస్తున్నారు.

2023లో సుమారు 37 పోలీసు శాఖ‌ల‌కు చెందిన అధికారులు దాదాపు 12,183 మందిని అరెస్టు చేశారు. అంటే స‌గ‌టున రోజుకు 33 మందిని అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు డేటాలో తెలిపారు. 2019తో పోలిస్తే ఇది 58 శాతం పెరిగిన‌ట్లు వెల్ల‌డించారు. ఆ సంవ‌త్స‌రంలో 7734 మందిని అరెస్టు చేశారు. 

అరెస్టు అయిన కేసుల్లో నేర నిర్ధార‌ణ‌, కోర్టు తీర్పులు దాదాపు స‌గానికి స‌గం ప‌డిపోయిన‌ట్లు డేటాలో వెల్ల‌డైంది. కోర్టు బ‌య‌ట కొన్ని కేసులు సెటిల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా పోస్టుల‌ను ఆధారంగా చేసుకుని జ‌రుగుతున్న అరెస్టుల‌ ప‌ట్ల ప్ర‌జా వ్య‌తిరేకిత వ‌స్తోంది. ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌పై అతిగా పోలీసుల్ని వినియోగిస్తున్నార‌ని పౌర హ‌క్కుల నేత‌లు ఆరోపిస్తున్నారు.