రాజకీయ విరాళాల్లో 88 శాతం బీజేపీకే

రాజకీయ విరాళాల్లో 88 శాతం బీజేపీకే

రాజకీయ విరాళాల విషయంలో బీజేపీ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి 8,358 విరాళాల నుంచి రూ.2,243 కోట్లకు పైగా సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక విరాళాలను పొందిన రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. దీనికి 1,994 విరాళాల ద్వారా రూ.281.48 కోట్లు వచ్చాయి. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు మొత్తం 12,547 విరాళాల ద్వారా రూ.2,544.28 కోట్లు అందాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో జాతీయ పార్టీలకు విరాళాలు 199 శాతం మేర పెరిగాయి. 2023-24లో జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 88 శాతం ఒక్క బీజేపీ ఖాతాలోకే చేరాయి.

2022-23లో బీజేపీకి రూ.719.858 కోట్ల విరాళాలు రాగా, 2023-24లో ఆ పార్టీకి రూ.2,243.94 కోట్ల డొనేషన్లు వచ్చాయి. మొత్తంగా 211.72 శాతం పెరుగుదల నమోదైంది. 2022-23లో కాంగ్రెస్‌కు రూ.79.924 కోట్ల విరాళాలు రాగా, 2023-24లో రూ.281.48 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దీంతో 252.18 శాతం పెరుగుదల నమోదైంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి) తమకు వచ్చే విరాళాలు బాగా తగ్గాయని ప్రకటించాయి. 2023-24లో ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు 70.18 శాతం లేదా రూ. 26.038 కోట్లు, ఎంపిపి విరాళాలు 98.02 శాతం లేదా రూ. 7.331 కోట్లు మేర తగ్గిపోయాయి.

ఎన్నికల విరాళాల వివరాలతో 2024 సెప్టెంబర్ 30లోగా నివేదికలను సమర్పించాలని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. అయితే బీఎస్‌పీ, ఆప్ మాత్రమే సకాలంలో నివేదికలు సమర్పించాయి. బీజేపీ 42 రోజులు ఆలస్యంగా నివేదికను సమర్పించింది. సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఎన్‌పీపీలు 43, 27, 23 రోజులు ఆలస్యంగా నివేదికలు ఈసీకి సమర్పించాయి.

రూ.20వేలకు మించిన రేంజులో ఒక్క విరాళం కూడా రాలేదని బీఎస్పీ మరోసారి ప్రకటించింది. 2023-24లో కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి జాతీయ పార్టీలకు మొత్తం 3,755 విరాళాలు అందాయి. వీటి మొత్తం విలువ రూ. 2,262.55 కోట్లు. ఇది మొత్తం విరాళాలలో 88.92 శాతానికి సమానం. 

ఇక 8,493 మంది వ్యక్తిగత దాతల నుంచి రూ. 270.872 కోట్లు పార్టీలకు అందాయి. ఇవి మొత్తం విరాళాలలో 10.64 శాతానికి సమానం. కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి 3,478 విరాళాల ద్వారా బీజేపీకి రూ. 2,064.58 కోట్లు సమకూరాయి. 4,628 మంది వ్యక్తిగత దాతల నుంచి ఆ పార్టీకి రూ.169.126 కోట్లు అందాయి.

కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి 102 విరాళాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి రూ.190.3263 కోట్లు సమకూరాయి. 1,882 మంది వ్యక్తిగత దాతల నుంచి ఆ పార్టీకి రూ. 90.899 కోట్లు అందాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇతర జాతీయ పార్టీల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా బీజేపీకి కార్పొరేట్ విరాళాలు వచ్చాయి.

2023-24లో బీజేపీ, కాంగ్రెస్‌లకు కలిపి ఏకంగా రూ. 880 కోట్ల విరాళం ఇచ్చింది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ బీజేపీకి రూ.723.675 కోట్లు ఇవ్వగా, మొత్తం విరాళాల్లో 32.25 శాతం ఇవే. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు కాంగ్రెస్ పార్టీకి రూ.156.4025 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ పార్టీ అందుకున్న మొత్తం విరాళాల్లో 55.56 శాతం(సగానికిపైగా) ఇవే.

2023-24లో ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.127.50 కోట్లను విరాళంగా ఇచ్చింది. జైభారత్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి బీజేపీకి రూ.5 కోట్ల విరాళం వచ్చింది. డెరైవ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బీజేపీకి రూ.50 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.3.20 కోట్లను విరాళంగా ఇచ్చింది. బీజేపీకి ఆక్మే సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.51 కోట్లు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.50 కోట్లు, రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లు, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చాయి.