వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో పిల్స్.. బిజెపి ఆగ్రహం

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో పిల్స్.. బిజెపి ఆగ్రహం
 
పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలవుతున్న పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. వీటిని ”ఓట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు”గా పేర్కొంది.  ఇది కేవలం ఓటు బ్యాంకు ప్రయోజనాలను కాపాడుకోవడం, దేశంలో అల్లరి తరహా పరిస్థితి సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నమని సోమవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు.

వక్ఫ్ ఆస్తులను అక్రమించుకున్న ల్యాండ్ మాఫియాకు చెందిన వారు మాత్రమే కొత్త చట్టం వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భయపడుతున్నారని పూనావాలా ఆరోపించారు. సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేయడాన్ని ప్రస్తావిస్తూ ”ఇవి పిల్స్‌కు తక్కువ, ఓటు బ్యాంకు ప్రయోజనాలకు ఎక్కువ” అని ఎద్దేవా చేశారు. 

వక్ఫ్ చట్టాన్ని లీగల్‌గా సవాలు చేస్తున్న వారి వెనుక కాంగ్రెస్, ఏఐఎంఎంఎం, కొన్ని ముస్లిం సంస్థలు ఉన్నాయని చెప్పారు. కొత్త చట్టం సామాజిక న్యాయానికి, వక్ఫ్ ఆస్తుల సక్రమ నిర్వహణకు దోహదపడుతుందని వివరించారు. ఇది హిందూ- ముస్లిం అంశం కాదని, వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడాన్ని పలు ముస్లిం సంస్థలు, క్రైస్తవ సంస్థలు స్వాగతించాయని చెప్పారు. 

1985లో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనేందుకు పార్లమెంటును కాంగ్రెస్ ఉపయోగించుకుందని, ఇప్పుడు వెనుకబడిన, ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు బిల్లు ఆమోదిస్తే తిరిగి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది ఆయన ధ్వజమెత్తారు.

కాగా, వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం సోమవారంనాడు విచారణ చేపట్టింది. అయితే, ఈ పిటిషన్లపై త్వరిగతగతిని విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తి పట్ల సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 

కేసులను అత్యవసరంగా విచారించాలని కోరుతూ పంపే రాతపూర్వక అభ్యర్ధనలు లేదా ఇ మెయిల్స్‌ వంటి వాటిని పరిశీలించేందుకు ఒక పద్దతి వుందని, దాన్ని కోర్టు అనుసరిస్తుందని జస్టిస్‌ ఖన్నా చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి మొత్తంగా పరిస్థితులను సమీక్షించి, ఆయా కేసులను బెంచ్‌లకు అప్పగిస్తారని పేర్కొన్నారు. ఇవన్నీ చూసేందుకు ఇప్పటికే ఒక వ్యవస్థ అమల్లో వుండగా, మీరెందుకు ప్రస్తావిస్తున్నారని జస్టిస్‌ ఖన్నా పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ప్రశ్నించారు. 

ఈ పిటిషన్లను సత్వరమే విచారించాల్సిన అవసరం వుందని సమస్తా కేరళ జమైతుల్‌ ఉలేమా తరపు న్యాయవాదులు ఎ.ఎం.సింఘ్వి, జుల్ఫీకర్‌ అలీ, ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసి తరపు న్యాయవాది నిజామ్‌ పాషా కూడా కోరారు. వక్ఫ్‌ ఆస్తులపై, వాటి నిర్వహణపై ఈ చట్టం ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తుందని పిటిషనర్లు పేర్కొంటున్నారు. 

కాగా, 1995 నాటి వక్ఫ్‌ చట్టాన్ని సవరిస్తూ కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సోమవారం ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మతపరమైన, దాతృత్వ కార్యకలాపాల కోసం అల్లాకు శాశ్వతంగా అంకితమైన వక్ఫ్‌ ఆస్తుల పాలన, ఏర్పాటు, రక్షణ వంటి అంశాలను కొత్తగా తీసుకువచ్చిన సవరణలు ప్రాధమికంగా మార్చివేస్తున్నాయని ఐయుఎంఎల్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని 14, 15, 25, 26 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ఆ పిటిషన్‌ పేర్కొంది.