గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు

గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు
 
గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు అయ్యిందన, ఇంత వేగవంతమైన వృద్ధికి ఒక పెద్ద కారణం మన అద్భుతమైన ఆధునిక మౌలిక సదుపాయాలేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత పదేళ్లలో రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, నీరు, ఓడరేవులు, విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్లు మొదలైన మౌలిక సదుపాయాల బడ్జెట్‌ను సుమారు ఆరు రెట్లు పెంచామని చెప్పారు.
 
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర వంతెన ఇది.
 
రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా తమిళనాడులో రూ.8300కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 
 
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  నేడు దేశంలో భారీ ప్రాజెక్టుల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఉత్తరాన చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనల్లో ఒకటైన ‘చీనాబ్ వంతెన’ జమ్మూ కశ్మీర్‌లో నిర్మించామని చెప్పారు. పశ్చిమంలో ముంబయిలో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ నిర్మించినట్లు పేర్కొన్నారు.

తూర్పు వైపున అసోంలోని ‘బోగీబీల్ వంతెన’ కనిపిస్తుందని, దక్షిణాదికి వస్తే ప్రపంచంలోని కొన్ని నిలువు లిఫ్ట్ బ్రిడ్జిలలో ఒకటైన ‘పంబన్ వంతెన’ నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో తమిళనాడుది పెద్ద పాత్ర అని చెబుతూ తమిళనాడు బలం ఎంతగా పెరుగుతుందో భారత్‌ అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానని తెలిపారు. 

గత దశాబ్ద కాలంలో 2014 కంటే మూడు రెట్లు అధికంగా తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కారణం లేకుండా ఏడవడం కొందరికి అలవాటని పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విసుర్లు విసిరారు. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ సంవత్సరం తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6 వేల కోట్లకుపైగా కేటాయించారని గుర్తు చేశారు.

భారత ప్రభుత్వం ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని, ఇందులో రామేశ్వరం రైల్వేస్టేషన్‌ సైతం ఉందని చెప్పారు. పంబన్ వంతెన  దేశవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వృద్ధి పెరగడానికి దోహదపడుతుందని, తమిళనాడులో పర్యటకాభివృద్ధి జరుగుతుందని ప్రధాని చెప్పారు.  ”ఇది చాలా ప్రత్యేకమైన రోజు. రూ.8,300 కోట్ల అభివృద్ధి ప్రాజక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. రైలు, రోడ్డు ప్రాజెక్టులతో తమిళనాడుకు మరింత అనుసంధానం పెరుగుతుంది. తమిళనాడు సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తు్న్నాను” అని మోదీ తెలిపారు. 

అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. ఇందువల్ల తమిళనాడులో వాణిజ్యంతో పాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న రామేశ్వరం పట్టణంలో నిర్మించిన పంబన్ వంతెన 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రధాని అభివర్ణించారు. ఇదిలా ఉండగా రామేశ్వరానికి వెళ్లే పంబన్‌ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సందర్భంగా రామేశ్వరం ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.