అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకత్వం బీజేపీది!

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకత్వం బీజేపీది!

అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఉన్న పీడీఎస్ వ్యవస్థను జగజ్జీవన్ రామ్ ప్రారంభించారని గుర్తుచేశారు.

మన సైనికులను హతమారుస్తున్న సమయంలో పొరుగు దేశంలోకి వెళ్లి ఉగ్రవాద సంస్థలను హతమార్చారని, జమ్ము కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పారని ఆమె గుర్తు చేశారు. శరణార్దులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పించి  ఆశ్రయం కల్పించారని ఉద్ఘాటించారు. 500 సంవత్సరాల బారతీయుల కల రామమందిరం నిర్మాణాన్ని నిజం చేశారని తెలిపారు. 

ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని పేర్కొంటూ వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా పార్లమెంట్ లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడటమే తప్ప వారి క్షేమం కోసం చేసిన ఘనత మోదీదేదని ఆమె స్పష్టం చేశారు.

వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతల్లో ఇంకా సమర్ధవతంగా చేయడానికి మార్పులు చేశారని, కానీ మతపరమైన అంశాల్లో ఎక్కడా మార్పులు చేయలేదని ఆమె తేల్చిచెప్పారు. భక్తుల కోసం ఇచ్చిన భూములను సరిగా వినియోగిస్తున్నారా లేదా అనేది సరి చేయడానికి మార్పులు చేశారని పేర్కొన్నారు. 

2013 సంవత్సరంలో ఎన్నికలకు కొన్ని నెలలు ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్‌ను సవరణ చేశారని, మైనార్టీ బోర్డునునిర్వీర్యం చేసి కావాల్సిన వారు బోర్డులు పెట్టుకోవచ్చని మైనార్టీల్లో విభజన తెచ్చారని ఆమె ధ్వజమెత్తారు. 2013లో యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ఆమె విమర్శించారు.

సరిగ్గా చర్చ లేకుండా వక్ఫ్ బిల్లు ఆమోదించారని సోనియా గాంధీ విమర్శించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ చర్చ జరిగినప్పుడు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ సభలో ఉన్నారా? అని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు అభిప్రాయాలు చెప్పాక పార్లమెంట్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు బిల్లు ఆమోదం పొందిందని ఆమె  గుర్తుచేశారు. 

రాజ్యసభలో మరునాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు బిల్లు ఆమోదం పొందిందని ఆమె తెలిపారు. మరి వారు సభలో లేకుండా వీటిపై అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేశారని ఆమె నిలదీసేరు. వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపాలని అందరూ చెప్పారని, నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి అభిప్రాయలను సేకరించారని ఆమె తెలిపారు.

25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డుల నుంచి జాయింట్ పార్లమెంట్ కమిటీకి తమ అభిప్రాయాలను వివరించారని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు అందరి ఆమోదంతోనే జరిగిందని, అయినా కొంతమంది రాజకీయం చేస్తున్నారని  పురందేశ్వరి మండిపడ్డారు. రైల్వే, రక్షణ శాఖల తర్వాత వక్ఫ్ దగ్గరే భూమి ఎక్కువగా ఉందని చెబుతూ వక్ఫ్ ఆదాయం మాత్రం రూ. 163 కోట్లు అంటే నవ్వుతారని చెప్పారు.

వక్ఫ్ బోర్డులో మహిళలకు అసలు ప్రాతినిథ్యం లేదని, ముస్లిం మైనార్టీలో వెనుకబడిన వారికి వక్ప్ బోర్డులో ప్రాతినిధ్యం లేదని దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేశారు. వీరందరికీ ఇప్పుడు సవరణ బిల్లు ద్వారా ప్రాతినిధ్యం కల్పించాం మని పేర్కొంటూ అది తప్పు ఎలా అవుతుందని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం ముస్లింల జీవితాలతో ఆడుకున్న పార్టీలకు ప్రజలే బుద్ది చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. 

బీజేపీ ముస్లింలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, పైగా వారి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు. వైసీపీ లోక్‌సభలో సవరణ బిల్లుకు మద్దతు  చేయమని చెప్పి, రాజ్యసభలో విప్ ఇచ్చి మరీ మద్దతు ఇవ్వడం ద్వారా ద్వంద వైఖరి ప్రదర్శించిందని ఆమె విమర్శించారు.