పెండింగ్ చలాన్లపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌

పెండింగ్ చలాన్లపై  డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌
కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన నేపథ్యంలో పెండింగ్‌ ఈ-చలాన్లు ఉన్న వాహనదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. తమపై ఉన్న పెండింగ్‌ జరిమానాలను మూడు నెలల్లో చెల్లించని వారి డ్రైవింగ్‌ లెసెన్సులు సస్పెండ్‌ అవుతాయని స్పష్టంచేసింది. దీనికి అదనంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్‌ లైసెన్సు కనిష్ఠంగా మూడు నెలలపాటు సస్పెన్షన్‌కు గురవుతుంది. 
 
ప్రస్తుతం 40 శాతం మాత్రమే ఉన్న ఈ-చలాన్‌ రికవరీ రేటును పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కఠిన చర్యలను తీసుకువచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. చెల్లించని ఈ-చలాన్లను వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రెండు పెండింగ్‌ జరిమానాలు ఉన్న డ్రైవర వాహన ఇన్సూరెన్సును ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘనలను మరింత సమర్థంగా పసిగట్టేందుకు మోటారు వాహనాల చట్టంలోని 136ఏ సెక్షన్‌ కింద ఆధునిక టెక్నాలజీని అధికారులు ఉపయోగించుకోనున్నారు. 
 
ఇందులో సీసీటీవీ కెమెరాలు, స్పీడ్‌ గన్లు, బాడీ-వార్మ్‌ కెమెరాలు, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ గుర్తించే వ్యవస్థలు వంటివి ఉన్నాయి.  జరిమానాల రికవరీలో దేశంలోనే అతి తక్కువగా 14 శాతం రికవరీ రేటును ఢిల్లీ నమోదు చేసుకుంది. దీని తర్వాత స్థానాలలో కర్ణాటక (21 శాతం), తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ (27శాతం చొప్పున), ఒడిశా (29 శాతం) ఉన్నాయి. అత్యధిక రికవరీ రేటు రాష్ర్టాలలో రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా ఉన్నాయి.

ఈ-చలాన్లకు కొత్త ఎస్‌ఓపీలు

ఈ-చలాన్‌ జారీ, చెల్లింపుల కోసం కొత్త స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లను (ఎస్‌ఓపీలు) ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. దీని ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన జరిగిన మూడు రోజుల్లోగా ఈ-చలాన్‌ నోటీసులు డ్రైవర్లకు అందుతాయి. 30 రోజుల్లోగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. లేదా గ్రీవెన్స్‌ అథారిటీ ఎదుట సవాలు చేయవచ్చు. 

జరిమానాల చెల్లింపు 90 రోజుల్లోగా జరగని పక్షంలో జరిమానా చెల్లించేంత వరకు డ్రైవింగ్‌ లైసెన్సు లేదా వాహన రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌లో ఉంటుంది. వాహన డ్రైవర్లు తమ చిరునామా వివరాలను వాహన్‌, సాథీ పోర్టల్స్‌లో మూడు నెలల్లోగా మార్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి భారీ జరిమానాల విధింపును అమలులోకి తెచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన వారికి మొదటిసారి పట్టుబడితే రూ. 10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తుంది. ఒకసారికి మించి అదే నేరానికి పాల్పడితే రూ.15,000 జరిమానా, 2 సంవత్సరాల వరకు కారాగార శిక్షను విధిస్తుంది. 

ఇది వరకు డ్రంకెన్‌ డ్రైవింగ్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు జరిమానా ఉండేది. ఇక హెల్మెట్‌ లేకుండా వాహనాన్ని నడిపిన వారికి రూ.1,000 జరిమానాతోపాటు మూడు నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌ను విధించవచ్చు. కారులో సీటు బెల్టు ధరించని వారు కూడా రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్‌ ఫోన్‌తో డ్రైవింగ్‌ చేసే వారికి జరిమానాను రూ.5,000కు ప్రభుత్వం పెంచింది.