బెట్టింగ్ కుంభకోణం ఎఫ్ఐఆర్ లో మాజీ సీఎం భూపేష్ బఘేల్

బెట్టింగ్ కుంభకోణం ఎఫ్ఐఆర్ లో మాజీ సీఎం భూపేష్ బఘేల్
మహదేవ్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్మమంత్రి భూపేష్ బఘేల్ పేరును సీబీఐ తమ ఎఫ్ఐఅర్ లో చేర్చింది. ఛత్తీస్‌గడ్ ఆర్థిక నేరాల విభాగం ఇంతకుమందు తమ ఎఫ్ఐఆర్‌లో బఘేల్ పేరును చేర్చింది. ఇప్పుడు సీబీఐ కేసులోనూ ఆయన పేరు చేరింది. 
 
బెట్టింగ్ సంస్థతో సంబంధం ఉందని అనుమానిస్తున్న రాజకీయల వేత్తలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పలువురు వ్యక్తులపై ఇటీవల సీబీఐ విస్తృతదాడులు జరిపింది. ఛత్తీస్‌గఢ్, భోపాల్, కటక్, ఢిల్లీ సహా 60 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు సాగించింది. పలు కీలకమైన డిజిటల్, ఫైనాన్షియల్ రికార్డులను స్వాధీనం చేసుకుంది.

మహదేవ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్‌ను రూపొందించేందుకు అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘెల్ తనను ప్రోత్సహించారని, ఆయనకు రూ.508 కోట్లు చెల్లించామని యాప్ ఓనర్ శుభమ్ సోనీ విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశారు. 

ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. బఘెల్, యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్, మరో 14 మంది పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

తొలుత ఈ కేసుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమే విచారణ జరిపింది. ఆ తర్వాత సీనియర్ అధికారులు, కీలక నిందితుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి కేసు అప్పగించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను భూపేష్ బఘెల్ తోసిపుచ్చారు. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్‌లోనూ అధికారికంగా భూపేష్ బఘేల్ పేరు చేర్చడంతో ఈ కేసు రాజకీయంగానూ వేడెక్కే అవకాశం ఉంది. సీబీఐ తదుపరి చర్యపై ఉత్కంఠ నెలకొంది.