
విదేశీ జైళ్ళలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. భారత ప్రభుత్వం దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, అరబ్ దేశాలతో సహకారం ద్వారా చిన్న చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారి విడుదలకు కృషి చేసింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.
భారతీయులు అనేక కారణాల వాళ్ళ విదేశీ జైళ్లలో చిక్కుకుంటున్నారు.
ముఖ్యంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశం విడిచి పెట్టకపోవడం. విదేశీ చట్టాలను అర్థం చేసుకోకపోవడం వల్ల చేసే తప్పులు, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా బాధితులు కావడం, అనుమతి లేకుండా వేట చేయడం, ముఖ్యంగా సముద్ర మార్గంలో సరిహద్దులు దాటి వెళ్ళడం. ఒకసారి విదేశీ జైలుకి చేరాక, అక్కడి భాష, న్యాయవ్యవస్థ అవగాహన లేకపోవడం, న్యాయ సహాయం అందించడానికి ఎవ్వరూ లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
భారత ప్రభుత్వం ఇలాంటి వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. 2014 నుంచి భారత ప్రభుత్వం విదేశీ ఖైదీల సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని, అనేక ఒప్పందాలు చేసుకుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, గత పదేళ్లలో దాదాపు 10,000 మంది భారతీయులు జైళ్ల నుండి విడుదలయ్యారు.
అరబ్ దేశాల్లో పరిస్థితి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ), సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి దేశాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువ. ఈ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండటంతో చిన్న తప్పులకు కూడా తీవ్రమైన శిక్షలు అమలు చేస్తారు. అయితే, భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరిపి, రంజాన్, జాతీయ వేడుకల సమయంలో భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ఇప్పిస్తుంది.
2022-2025 మధ్య- 2022లో యుఎఈ 639 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. 2023లో ఈ సంఖ్య 700కు చేరింది. 2024లో 944 మంది ఖైదీలు విడుదలయ్యారు. 2025లో 500 మంది భారతీయులు విడుదలయ్యారు. సౌదీ అరేబియా- 2019లో 850 మంది భారతీయులను విడుదల చేయించింది. ఖతార్- మరణశిక్ష విధించిన 8 మంది భారతీయ నావికాదళ సిబ్బందిని మోదీ ప్రభుత్వం చర్చల ద్వారా విడుదల చేయించింది.
ఇరాన్- 2023లో 43 మంది, 2024లో 77 మంది భారతీయులు విడుదలయ్యారు. బహ్రెయిన్- 2019లో 250 మంది ఖైదీలను విడుదల చేసింది. కువైట్-22 మంది భారతీయులను విడుదల చేయడంతో పాటు, 97 మంది శిక్షలను సవరించింది. శ్రీలంక, పాకిస్తాన్ జలాల్లోకి చొరబడిన భారతీయ మత్స్యకారులు తరచూ అరెస్టు అవుతున్నారు.
2014 నుండి 2,639 మంది మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. 3,697 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. భారతీయులు విదేశీ జైళ్లలో చిక్కుకోవడం అనివార్యమైన సమస్య అయినప్పటికీ, మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం వల్ల వేల మంది భారతీయులు విముక్తి పొందుతున్నారు.
ప్రెసిడెన్షియల్ పర్డన్ ద్వారా ఖైదీలను విడుదల చేయించేందుకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చర్చలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!